కొడుకు బీజేపీ ఎంపీ.. ఆమె భారత సంపన్న మహిళ.. ఇండిపెండెంట్ గా పోటీ

భారతదేశంలో టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు.. అత్యంత సంపన్న వ్యక్తులు. తరతరాలుగా వీరు వ్యాపార రంగంలో ఉన్నారు.

Update: 2024-09-06 17:30 GMT

భారతదేశంలో టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు.. అత్యంత సంపన్న వ్యక్తులు. తరతరాలుగా వీరు వ్యాపార రంగంలో ఉన్నారు. లక్షల కోట్ల రూపాయిలను దేశానికి పన్ను రూపంలో చెల్లించారు. ఇంకా లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అయితే, వీరందరిలోనూ కామన్ పాయింట్ ఏమంటే.. వీరెవరూ రాజకీయాల సమీపానికి కూడా వెళ్లలేదు. రాజకీయాలను దగ్గరినుంచి చూస్తూ శాసించారే కానీ.. ఎన్నికల్లో దిగి పోటీ చేయలేదు. కానీ, ఒక్క కుటుంబం మాత్రం వీరికి భిన్నం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడమే కాదు.. ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబానికి చెందిన మహిళ ఎన్నికల్లో దిగుతున్నారు.

జిందాల్ జిందాబాద్

హరియాణాలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురుగాలి వీస్తోందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం గానీ.. కాంగ్రెస్ కు కాస్త అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. ఇక హరియాణ సమాజంపై బాగా ప్రభావం చూపే జాట్ రైతులు కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. 200కు పైగా రోజుల నుంచి ఆందోళలనలు చేస్తున్నారు. క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చే హరియాణలో.. నిరుడు రెజ్లర్లు వీధుల్లోకి వచ్చి బీజేపీకి చెందిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు చేశారు. ఇవన్నిటికి తోడు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలు కానున్నాయని చెబుతున్నారు. కాగా, ఇప్పుడు మరో ఆసక్తికర అంశం ఏమంటే.. భారత సంపన్న మహిళగా పేరుగాంచిన సావిత్రి జిందాల్‌ ఆ రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

బీజేపీ కాదు.. స్వతంత్రంగా..

సావిత్రి జిందాల్ వాస్తవానికి బీజేపీ తరఫున హిస్సార్‌ నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. బీజేపీ విడుదల చేసిన 67 మంది అభ్యర్థుల తొలి జాబితాలో ఆమె పేరు లేదు. హిస్సార్ టికెట్ ను వరుసగా రెండుసార్లు గెలిచిన ఆరోగ్య మంత్రి కమల్‌ గుప్తాకు ఇచ్చారు. కేటాయించింది. దీంతో సావిత్రి జిందాల్ హిస్సార్ లోని జిందాల్ చౌక్ కు చేరుకుని ర్యాలీలో మాట్లాడారు. బీజేపీలో తాను చేరలేదని చెప్పారు. కాంగ్రెస్ నూ వీడలేదన్నారు.

కొడుకు బీజేపీ ఎంపీ..

పలు రంగాల్లో భారీ పరిశ్రమలున్న జిందాల్ లది ప్రముఖ పారిశ్రామిక కుటుంబం. ఇక సావిత్రి జిందాల్‌ ఆస్తి 39.5 బిలియన్‌ డాలర్లు. సావిత్రి కుమారుడే నవీన్‌ జిందాల్‌. ఈయన బీజేపీ కురుక్షేత్ర ఎంపీ కావడం గమనార్హం. అయినప్పటికీ సావిత్రి తనకు టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహం ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించారు.

Tags:    

Similar News