సెంటిమెంట్ల సీఎం.. కేసీఆర్‌పై నెటిజన్ల ఇంట్రస్టింగ్ కామెంట్స్
అయితే.. ఇలాంటి వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరీ ముందు వరుసలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపైనే నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
రాజకీయాల్లో ఉన్న నాయకులకు ఒకరిద్దరు మినహా.. దాదాపు అందరికీ సెంటిమెంటు ఉంటుంది. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించే వరకు.. చివరకు గెలిచిన తర్వాత.. పదవీ ప్రమాణం చేసే దాకా కూడా ముహూర్తాలు.. నక్షత్రాలు చూసుకుని అడుగులు ముందుకు వేస్తుంటారు. అయితే.. ఇలాంటి వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరీ ముందు వరుసలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపైనే నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. రాజశ్యామల యాగం నిర్వహించారు. అది కూడా ఏపీకి చెందిన విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామిని పిలిచి మరీ మూడు రోజుల పాటు పది కోట్ల రూపాయలు ఖర్చు(వినికిడి) పెట్టి మరీ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇలా ఈ యాగం చేయడం.. కేసీఆర్‌కు మూడో సారి. 2015-17 మధ్య ఖమ్మంలోనూ పెద్ద యజ్ఞమే చేశారు. ఇక, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన యాగాలు చేయడం.. పరిపాటిగా మారింది. ఇదో సెంటిమెంటుగా ఆయన మార్చుకున్నారు.
కట్ చేస్తే.. తాజాగా సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తన నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచి అర్చనలు చేయించారు. ఇక, ఆలయ ప్రాంగణంలోనే కూర్చుని అక్కడే నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. ఈనెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ఆయా పత్రాలను శ్రీవారి చెంత ఉంచడం.. అక్కడే వాటిపై సంతకాలు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు.. సెంటిమెంట్ల సీఎం అంటూ.. కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
38 ఏళ్లుగా ఇక్కడే
సీఎం కేసీఆర్‌కు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి మధ్య 38 ఏళ్ల అనుబంధంతోకూడిన సెంటిమెంటు ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రతి ఎన్నికల ముందు నామినేషన్ పత్రాలను ఇక్కడి వేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా ఆయన చేస్తున్నారు. 1985, 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014 ఎన్నికల నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించిన తర్వాతే వాటిని రిటర్నింగ్ అధికారికి అందిస్తున్నారు. ఆయా ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి అనేది చవి చూడలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ పూజలు చేయడం గమనార్హం.