షర్మిల టోన్ మారుతోందా ?
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల గొంతు నెమ్మదిగా సవరించుకుంటున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల గొంతు నెమ్మదిగా సవరించుకుంటున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమె తాజాగా చేసిన ఒక ట్వీట్ లో జగన్ ప్రస్తావన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేకుండా విమర్శలు చేయడం అందరికీ ఆసక్తి కలిగించింది.
షర్మిల విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వివక్ష మీద తీవ్ర విమర్శలు చేశారు. అదే టైం లో ఆమె ఏపీ నుంచి ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ జనసేన పార్టీలను తప్పు పట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడలేకపోతే ఆర్ధిక ప్యాకేజ్ ని తీసుకుని రాలేకపోతే ఎన్డీయే నుంచి తప్పుకుని బయటకు రావాలని డిమాండ్ చేశారు.
కర్నాటక స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వకపోవడం కూటమిలోని టీడీపీ జనసేనల వైఫల్యం కిందకే లెక్క అన్నారు. కేంద్రంలో మూడవసారి ఎన్డీయే ఏర్పాటు అయింది అంటే దానికి ఈ రెండు పార్టీలు కారణం అని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ని గట్టెక్కించాలని కోరుతూ గత పద్నాలుగు వందల రోజులుగా ఉక్కు కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రధానితో మిట్టల్ స్టీల్ గురించి చర్చిస్తున్నారని షర్మిల విమర్శించారు. మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కు ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడాలని కోరుతున్నారని ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కు న్యాయం జరగకపోతే ఎన్డీయే నుంచి టీడీపీ, జనసేన బయటకు రావాలని డిమాండ్ చేశారు.
ఈ విధంగా షర్మిల నుంచి వచ్చిన ట్వీట్ లో ఎక్కడా జగన్ ప్రసక్తి లేదు అని అంటున్నారు. నిజంగా షర్మిల విమర్శలు చూస్తే గత ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది అని జగన్ మీదనే ఎక్కువగా విమర్శలు సంధించేవారు. ఇపుడు మాత్రం ఆమె పూర్తిగా అధికార టీడీపీ కూటమిని టార్గెట్ చేయడమే కాకుండా స్ట్రాంగ్ గానే కామెంట్స్ చేశారు.
దాంతో షర్మిల టోన్ మారుతోందా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు వైఎస్ విజయమ్మ క్రిస్మస్ వేడుకలలో జగన్ తో కలసి ఉండడం ఇపుడు షర్మిల వాయిస్ లో తేడా రావడంతో దీని మీదనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఎన్డీయే కూటమి పార్టీల మీదనే విమర్శలు చేస్తే బాగుంటుందని సూచిస్తూ వస్తున్నారు.
దాంతో షర్మిల ఈ విధంగా చేస్తున్నారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో విజయమ్మ జగన్ కలసి ఉన్న గ్రూప్ ఫోటోలు బయటకు రావడంతో ఇక జగన్ కుటుంబంలో వివాదాలకు తెర పడినట్లే అంటున్నారు. ఆస్తుల వివాదం కూడా ఒక కొలిక్కి రావచ్చునని కూడా అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత కూడా ఇంట గెలిచి రచ్చ గెలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి వైఎస్ అభిమానులు అయితే వైఎస్సార్ ఫ్యామిలీ అంతా ఒక్కటిగా ఉండాలనే బలంగా కోరుకుంటున్నారు. మరి ఆ రోజు నిజంగా రావాలనే కూడా ఆకాంక్షిస్తున్నారు.