షర్మిల వర్సెస్ వైసీపీ : అంతొద్దు... ఇది చాలు !

దాంతోనే ఆమె తన రాజకీయ దూకుడుని కొనసాగిస్తున్నారు. ఆమె ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అయి మరో రెండు నెలలలో ఏడాది పూర్తి అవుతుంది.

Update: 2024-10-28 17:30 GMT

షర్మిల వైఎస్ కుమార్తె. మాజీ సీఎం జగన్ కి సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నా ఆమె మీద పార్టీ ముద్ర కంటే వైఎస్సార్ కుటుంబ ముద్రనే ఎక్కువ. అందుకే ఆమెకు అంత గుర్తింపు. దాంతోనే ఆమె తన రాజకీయ దూకుడుని కొనసాగిస్తున్నారు. ఆమె ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అయి మరో రెండు నెలలలో ఏడాది పూర్తి అవుతుంది.

ఈ పది నెలల కాలంలో ఆమె అన్న వైఎస్ జగన్ కి ఎదురు నిలిచి ఆయన రాజకీయ జీవితాన్ని తారు మారు చేయడంలో శతధా ప్రయత్నించారు, అందులో చాలా వరకూ విజయం సాధించారు. జగన్ ని మాజీ సీఎం గా చేసిన షర్మిల వైసీపీ విపక్షంలోకి వచ్చినా కూడా అదే పంధాను అనుసరిస్తున్నారు. అధికార టీడీపీ కూటమి మీద విమర్శలు చేయాల్సి వస్తే తమలపాకుతో అలా సన్నగా కొడుతూ జగన్ మీద మాత్రం తలుపు చెక్కతోనే కొడుతున్నారు.

ఆ విధంగా ఆమె తన స్టాండ్ ఏంటో చెప్పేశారు. అయితే వైసీపీ కూడా తెలిసో తెలియకుండానే షర్మిల ట్రాప్ లోకి పడిపోయింది. పార్టీ మొత్తం ఆమె మీద మాటల దాడి చేయడం ద్వారా ఆమె ప్రాధాన్యతను రాజకీయంగా పెంచేస్తున్నారు అన్న భావన ఉంది. అదే టైం లో షర్మిల అంటే వైసీపీకి హడల్ అన్న భావాన్ని వారు చెప్పకనే చెప్పుకుంటున్నారు అని కూడా అంటున్నారు.

ఇటీవల ఆస్తుల వివాదంలో అయితే మొత్తానికి మొత్తం వైసీపీ నేతలు అంతా షర్మిల మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ విధంగా చూస్తే వైసీపీకి రాజకీయ ప్రత్యర్ధి కూటమి సర్కార్ నా లేక షర్మిలా అన్నది అర్ధం కాని పరిస్థితి.

ఇక ఎటూ రాజకీయంగా ప్రాధాన్యత ఈ విధంగా దక్కుతున్న నేపథ్యంలో షర్మిల సైతం ఎందుకు ఊరుకుంటారు, ప్రతీ విమర్శకూ తనదైన బదులిస్తూ మరింతగా వైసీపీని ముగ్గులోకి లాగేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వర్సెస్ షర్మిలగా వార్ నడుస్తూ ఏపీలో టీడీపీ కూటమిని ప్రజల సమస్యలను వైసీపీ మరచిపోయే పరిస్థితి వచ్చింది.

ఇక ఆస్తుల విషయం అన్నది పూర్తిగా సొంతమైనది. అది న్యాయ స్థానాలలో తేలాల్సినది. దానిని తెచ్చి షర్మిల రచ్చ చేసినా వైసీపీ కొంత సంయమనం పాటించి ఊరుకోవాల్సింది అని అంటున్నారు. అలా కాకుండా వైసీపీ షర్మిల మీద విమర్శల బాణాలు సంధించడం ద్వారా మరింతగా ఆస్తుల ఇష్యూని తనకు తెలియకుండానే జనంలోకి పంపినట్లు అయింది

ఈ క్రమంలో ఎవరికి తోచిన విధంగా వారు ఈ అన్నా చెల్లెళ్ల తగాదాలో తీర్పు చెబుతున్నారు ఇలా సాగుతున్న రాజకీయం నుంచి ఇపుడు వైసీపీ అధినాయకత్వం కాస్తా లేటుగా అయినా బయటకు వచ్చింది అని అంటున్నారు. షర్మిల ఆస్తుల విషయంలో జగన్ ని దోషిగా చూపించాలని చూసింది. దానికి వైసీపీ రియాక్ట్ అయి కౌంటర్ ఇచ్చేసింది. అన్నీ జనంలోనే ఉన్నాయి. కాబట్టి వారే ఇక ఆలోచించుకుంటారు అన్నట్లుగా హై కమాండ్ వైఖరి ఉంది అని అంటున్నారు.

ఇక మీదట షర్మిల ఊసు ఎత్తకుండా టీడీపీ కూటమి పాలన మీదనే ఫోకస్ పెట్టి తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల పక్షం గా ఉండాలని వైసీపీ భావిస్తోంది. షర్మిల విమర్శలు మరిన్ని చేసినా వాటిని పట్టించుకోకుండా లైట్ తీసుకోవాలని కూడా డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

మొత్తం మీద చూస్తే టీడీపీ కూటమి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇదొక భాగమని ఆలస్యంగా వైసీపీ గుర్తించిందని అందుకే షర్మిలతో వార్ ఎపిసోడ్ ని అంతొద్దు ఇక చాలు అన్నట్లుగా ఫుల్ స్టాప్ పెట్టేయడానికే నిర్ణయించిందని అంటున్నారు. మరి షర్మిల ఇంతకు ఇంత అన్నట్లుగా రెట్టించి మాట్లాడితే వైసీపీ ఏమి చేస్తుంది అన్నది ఒక ప్రశ్న. అయితే వైసీపీ తనదైన వివేచనతోనే ఈ ఇష్యూని డైల్యూట్ చేస్తూ రాజకీయంగా కూటమితోనే తలపడేందుకు సిద్ధపడాలని చూస్తోంది అని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్.

Tags:    

Similar News