వైసీపీలోకి షర్మిళ... ఆసక్తికర రియాక్షన్!

ఈ సమయంలో... తిరిగి వైసీపీలో చేరడంపై షర్మిళ ఆసక్తికరంగా స్పందించారు.

Update: 2024-05-07 09:28 GMT

సార్వత్రిక ఎన్నిక వేళ వైసీపీ వర్సెస్ కూటమి పోరు ఒకెత్తు అయితే.. వైఎస్ జగన్ వర్సెస్ షర్మిళ మధ్య రాజకీయం మరొకెత్తు అన్నట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ వైఎస్ జగన్ పైనా, ఏపీ సర్కార్ పైన షర్మిళ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... తిరిగి వైసీపీలో చేరడంపై షర్మిళ ఆసక్తికరంగా స్పందించారు.

అవును... తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో విభేదించిన తర్వాత తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు షర్మిళ. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఆమె వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించారు.. పాదయాత్ర కూడా చేశారు. అయితే అనూహ్యంగా ఎన్నికల వేళ ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.

ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షురాలైన వైఎస్ షర్మిళ... ఏపీకి ప్రత్యేక హోదా తేవడంలో వైఎస్ జగన్ సర్కార్ పూర్తిగా విఫలమయ్యిందంటూ విమర్శలు గుప్పించారు. అయితే... అది ముగిసిన అధ్యాయం అని చెప్పిన చంద్రబాబుపై మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడకపోవడంతో రకరకాల విమర్శలు వచ్చాయి! దీంతో.. ఆమె చంద్రబాబు వదిలిన బాణం అనే కామెంట్లూ తెరపైకి వచ్చాయి.

ఇక ఎన్నికలు సమీపించిన వేళ ఆమె కడప లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. అక్కడ సమీప ప్రత్యర్థి వైసీపీ నేత అవినాష్ పై తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. వివేకా హత్య కేసు పేరు చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో... తిరిగి వైసీపీలో చేరికపై ఆమె స్పందించారు.

ఇందులో భాగంగ... ఎన్నికల ప్రచారం సందర్భంగా షర్మిలకు వైసీపీలోకి తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నారా అని ప్రశ్న ఎదురైంది. దీంతో స్పందించిన షర్మిళ... ఎలాంటి సందేహం, సంకోచం లేకుండా “లేదు! అది ముగిసిన అధ్యాయం" అన్నట్లుగా కామెంట్ చేశారు. దీంతో... షర్మిళ ఇక తన సోదరుడి పార్టీలో చేరే ఆలోచన లేనట్లే అనే.. ఇక ఆ విషయంపై చర్చ, సందేహాలు అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు!

Full View
Tags:    

Similar News