"జగనన్నదీ నాదీ ఒకే రక్తం.. ఈ జగనన్న నాకు తెలియదు"!

ఈ సందర్భంగా తన ఐడెంటిటీపై వస్తున్న విమర్శలపై స్పందించిన షర్మిళ... "నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.. రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తోంది.. నా పేరు వైఎస్ షర్మిలా రెడ్డి.

Update: 2024-01-29 13:08 GMT

ఏపీ పీసీసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైఎస్ షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీని తన పుట్టిల్లు అంటున్న ఆమె... ప్రత్యేక హోదా తేవడం, పోలవరం పూర్తి చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలుసుకునే కార్యక్రమమంలో భాగంగా జిల్లాల పర్యటన చేపట్టిన ఆమె.. సోమవారం కడప జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... కడప జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో వైఎస్ షర్మిల సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైసీపీ, టీడీపీ, బీజేపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే అది బీజేపీకే చెందుతుందని అన్నారు. ఇదే క్రమంలో టీడీపీ, వైసీపీకి మళ్లీ ఓటు వేస్తే భవిష్యత్తు శూన్యమవుతుందని.. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా తన ఐడెంటిటీపై వస్తున్న విమర్శలపై స్పందించిన షర్మిళ... "నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.. రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తోంది.. నా పేరు వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే.. ఎవరు కాదన్నా, అవునన్నా.. ఎవరు గీపెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చా.. నా గుండెలో నిజాయితీ ఉంది" అని ఘాటుగా స్పందించారు.

ఇదే సమయంలో... ఆంధ్రరాష్ట్ర ప్రజలకు వాళ్ల హక్కులు కల్పించడం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇవాళ తన పుట్టింటిలో (ఆంధ్ర రాష్ట్రంలో) అడుగు పెట్టింది. ప్రత్యేక హోదా, పోలవరం వచ్చే వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. మన బిడ్డలను ఉద్యోగాలకు రావాలి.. అంతవరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి. ఇక్కడ భయపడే వాళ్లు ఎవ్వరూ లేరు. ఖబడ్దార్.. అంటూ షర్మిల వ్యాఖ్యానించారు!

ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న మారిపోయారు!:

ఇదే సమయంలో... తన అన్న, వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ పైనా షర్మిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న పూర్తిగా మారిపోయారని ఆరోపించారు. అనంతరం... "జగనన్నతో మనకు ద్వేషం లేదు. జమ్మలమడుగులోని హాస్పిటల్లో జగనన్న ఎక్కడ పుట్టారో నేను అదే హాస్పిటల్లోనే పుట్టాను. జగనన్నదీ నాది ఒకే రక్తం. అన్న సీఎం అయ్యాక మారిపోయారు. ఈ జగనన్న నాకు తెలియదు" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిళ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి!


Tags:    

Similar News