షర్మిల రాజకీయం కరెక్టేనా...!?
షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ నేతల టచ్ లో ఉన్నారని అంటున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లో పనిచేస్తే స్వాగతిస్తామని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అంటున్నారు.
వైఎస్సార్ రాజకీయంగా కీలకంగా ఉన్నపుడు తన వారసులను తేవడానికి పెద్దగా ఇష్టపడలేదు అని అంటారు. ఆయన తనకు సాయంగా ఉంటారని సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిని మాత్రమే ప్రోత్సహించారు. అది కూడా ఆయన ఎంపీగా వెళ్లాల్సి వచ్చినపుడు అలా జరిగింది. ఆయన 1978 నుంచి పాలిటిక్స్ లో ఉన్నా మంత్రిగా పీసీసీ చీఫ్ గా పనిచేసినా పదిహేనేళ్ల పాటు ఆయన రాజకీయ వారసత్వం మాత్రం కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు.
అయితే 1989లో మాత్రం ఆయన ఎంపీగా ఫస్ట్ టైం పోటీ చేయాల్సి వచ్చినపుడు మాత్రమే వైఎస్ వివేకా ఎంట్రీ ఇచ్చారు. ఇక వైఎస్సార్ తనతోనే రాజకీయం ముగిద్దామని అనుకున్నారని చెబుతారు. అంతే కాదు తనకు అరవై ఏళ్లు వచ్చేసరికి రాజకీయాల నుంచి విరమణ తీసుకుని హాయిగా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ లీడ్ చేయాలని చూశారు. కానీ ఆయన అనూహ్యంగా ఆ అరవై ఏళ్లకే ఈ లోకాన్ని వీడిపోయారు.
ఆయన తనయుడు వైఎస్ జగన్ 2009లో కడప ఎంపీగా తొలిసారి పోటీ చేశారు. అలా వైఎస్ కుమారుడిని మాత్రం ఎంతో ఆలోచించిన మీదటనే రాజకీయ అరంగేట్రం చేయించారు. ఇక వైఎస్సార్ వ్యక్తిగత జీవితంలో రాజకీయ ప్రస్తావనే ఉండేది కాదు అంటారు. సరే వైఎస్సార్ బతికి ఉన్నపుడే జగన్ పొలిటికల్ ఎంట్రీ జరిగింది కాబట్టి ఆయన వారసుడిగా జనంలోకి వచ్చారు. ఆయనకు సహాయంగా వైఎస్ తనయ షర్మిల ఉన్నారు.
వైసీపీ ఆవిర్భావం తరువాత పార్టీ కోసం పనిచేశారు అనుకున్నా ఆమె రాజకీయ ఆసక్తులు ఏవీ ఏ దశలోనూ బయటపడలేదు. అంటే మీడియా ముందుకు ప్రచారంగా రాలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు జగన్ తో గ్యాప్ ఏర్పడింది అని ప్రచారం జరిగినా అది ఉత్తదే అనుకున్నారు. అయితే ఆమె 2022 మొదట్లో తెలంగాణాలో పార్టీ పెట్టి ఆ మీదట గట్టిగానే తిరిగారు.
అలా ఆమె తెలంగాణాలో పాదయాత్ర చేశారు. గమ్యం లేని పాదయాత్రగా అది మారింది అని తెలుసుకునేసరికి మూడున్నర వేల కిలోమీటర్లు ఆమె తిరిగారు. ఆ తరువాత ఆమె రాజకీయం మరింత గందరగోళంగా సాగింది. ఆమె కాంగ్రెస్ కి మద్దతు అన్నారు, ఆ తరువాత పొత్తు అన్నారు. ఆ తరువాత విలీనం అన్నారు. మళ్లీ తూచ్ తనతో పాటు అంతా పోటీకి దిగుతామని ప్రకటించారు.
మొత్తానికి ఎంతో అయోమయం తరువాత కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఆమె చేసిన హాట్ కామెంట్స్ తో తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచినా ఆమె మద్దతు ఇచ్చినా కూడా ఆమెకు ఏ మాత్రం అక్కడ ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక ఆమె పార్టీ విలీనం ఉంటుందా లేదా అనుకుంటే ఆమెను తెచ్చి ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పనిచేయమని కోరుతుందని ప్రచారం మొదలైంది.
అంతే కాదు ఆమెకు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే షర్మిల వైఎస్సార్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్ధిగా దశాబ్దాల పాటు ఉన్న నారా కుటుంబానికి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలపడం ఒక ట్విస్ట్. ఆమె కావాలని చేశారా లేక అది కూడా వ్యూహంలో భాగమా అన్నది తెలియడంలేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆమెని పీసీసీ చీఫ్ గా ఏపీకి నియమిస్తూ 2024 జనవరి ఒకటవ తేదీన ఏఐసీసీ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తుందని అంటున్నారు.
షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ నేతల టచ్ లో ఉన్నారని అంటున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లో పనిచేస్తే స్వాగతిస్తామని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అంటున్నారు. ఢిల్లీలో ఈ నెల 27న కీలకమైన మీటింగ్ ఏపీ రాజకీయాల మీద రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగబోతోంది. అందులో షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించే విషయం చర్చిస్తారు అని అంటున్నారు.
జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే అన్న జగన్ కి ఎదురు నిలిచి పోరాడేందుకే షర్మిల సిద్ధం అయ్యారని అంటున్నారు. టీడీపీతో కూడా ఆమె సఖ్యతగా ఉన్నట్లుగా చెప్పేందుకే క్రిస్మస్ గిఫ్ట్ అని అంటున్నారు. సరే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇస్తే అద్భుతాలు జరుగుతాయా అన్నది కూడా చర్చగా ఉంది. కాంగ్రెస్ కి 2014, 2019లలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ ఎంతో కొంత పుంజుకుంది అనుకున్నా అయిదారు శాతం ఓట్లు పెరుగుతాయి తప్ప అంతకంటే ఏమీ సాధించేది ఉండదని అంటున్నారు.
అయితే ఆ ఓట్లు వైసీపీ నుంచి చీలిస్తారా అన్నదే చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయింది. ఇపుడు వెనక్కి తీసుకుని వచ్చేందుకుఏ షర్మిలకు పగ్గాలు అందించాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది అంటున్నారు. ఎంత చెప్పుకున్నా షర్మిల వల్ల ఏపీ కాంగ్రెస్ నిలబడుతుందా అన్నదే ప్రశ్నగా ఉంది. ఈ క్రమంలో వైసీపీకి ఆమె నష్టం చేకూరిస్తే మాత్రం రాజకీయంగా భారీ లాభం టీడీపీ పొందుతుంది అని అంటున్నారు.
అలా కాకుండా ఓట్ల చీలిక విపక్షంలోనే జరిగితే మళ్లీ జగన్ వస్తారు. అపుడు కూడా షర్మిల రాజకీయంగా తనకంటూ ఏమీ సాధించుకోలేని పరిస్థితిలో ఉంటారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే షర్మిల రాజకీయంలో దూకుడు తప్ప వ్యూహం కనిపించడం లేదు అంటున్నారు. అన్నతో విభేదాలు ఉంటే వాటిని రాజకీయ పోరాటంగా మార్చుకుంటే అది ఎంతవరకూ సక్సెస్ అవుతుంది అన్నది రాగల కాలమే జవాబు చెబుతుంది అని అంటున్నారు.