ఏ పార్టీకి ఓటేశావక్కా.. షర్మిలపై ట్రోల్స్!
ఒక పార్టీకి అధ్యక్షురాలు. ఒక అగ్రనాయకుడికి తనయ. పైగా.. సొంతగా పాదాలతో నడిచే యాత్ర పాదయాత్ర కూడా చేశారు
ఒక పార్టీకి అధ్యక్షురాలు. ఒక అగ్రనాయకుడికి తనయ. పైగా.. సొంతగా పాదాలతో నడిచే యాత్ర పాదయాత్ర కూడా చేశారు. కానీ, ఎన్నికల వేళ చేతులు ఎత్తేశారు. కేసీఆర్‌ను బూచిగా చూపించి.. ఎన్నికల పోటీకి దూరంగా పారిపోయారు. ఆమే ఎవరో కాదు.. వైఎసార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అయితే.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే.. మింగలేక.. కక్కలేక.. అన్నట్టుగా మారిపోయింది.
తాజాగా తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో షర్మిల.. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. అయితే.. దీనిపై సోషల్ మీడియా జనాలు.. తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. ఏ పార్టీకి ఓటేశావక్కా? అని కొందరు ప్రశ్నిస్తే.. ఒక పార్టీకి అధ్యక్షురాలివై ఉండి.. వేరే పార్టీకి ఓటెలా వేశారండీ? అని మరికొందరు సున్నితంగానే ప్రశ్నించారు.
ఇంకొందరు.. వైఎస్ బతికి ఉంటే.. ఈ ఘోరం చూసేవాడు కాదని అన్నారు. మరికొందరు.. గతంలో యూపీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఎస్పీ మాయావతి ఇంటికే పరిమితం అయ్యారని..కానీ, ఓటు మాత్రం వేయలేదని.. వ్యాఖ్యానించారు. ఒక పార్టీ అధ్యక్షురాలు.. మరోపార్టీకి ఓటేయడం.. ప్రజాస్వామ్యంలో కొత్త పోకడ అని ఇంకొందరు అన్నారు. మొత్తానికి షర్మిల ఓటు వేయడం వరకు బాగానే ఉన్నా.. ఆమె రాజకీయంపై మాత్రం విమర్శలు వచ్చాయి.
ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తానని.. పాలేరు నుంచి గెలిచి తీరుతానని అనేక సందర్భాల్లో చెప్పిన షర్మిల.. తర్వాత..యుద్ధం మొదలయ్యేసరికి.. డక్ ఔట్ ప్రకటించారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నానన్నారు. కానీ, ఎక్కడా ఒక్క ప్రసంగం చేయలేదు. ఒక సభలో కూడా పాల్గొనలేదు. ఇక, ఇప్పుడు వచ్చి ఓటు వేశారు. ఈ పరిణామమే నెటిజన్ల నుంచి ట్రోల్స్ వచ్చేలా చేసిందని అంటున్నారు పరిశీలకులు.