కేరళలో మాస్ మర్డర్స్... ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేశాడు!
దీంతో.. పోలీసులు తొలుత కాస్త సందేహంగా చూడగా.. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎలా చంపిందీ వివరించడంతో షాకయ్యారని అంటున్నారు.;
కేరళలోని తిరువనంతపురం శివారులోని పోలీస్ స్టేషన్ లోకి అఫాన్ అనే 23 ఏళ్ల వ్యక్తి వెళ్లి.. అక్కడున్న పోలీసు అధికారికి ఓ విషయం చెప్పాడు. అదేమిటంటే... తాను తన తల్లి, అమ్మమ్మ, స్నేహితురాలు, సోదరుడు సహా ఆరుగురు వ్యక్తులను హత్య చేసినట్లు పేర్కొన్నాడు. దీంతో.. పోలీసులు తొలుత కాస్త సందేహంగా చూడగా.. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎలా చంపిందీ వివరించడంతో షాకయ్యారని అంటున్నారు.
అవును.. కేరళలో అత్యంత ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... అఫాన్ అనే వ్యక్తి ఇంట్లో తల్లి, అమ్మమ్మ, స్నేహితురాలు, తమ్ముడు, మామ, అత్త ఇలా ఆరుగురిపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా.. అతడి తల్లి మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో పోరాడుతోందని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
నివేదికల ప్రకారం... దుబాయ్ లో బిజినెస్ చేస్తున్న తన తండ్రి రూ.75 లక్షల అప్పులు చేశాడని.. దీనివల్ల తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని అఫాన్ చెబుతున్నాడంట. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ తనకు సహాయం చేయడానికి అంగీకరించలేదని.. దీంతో అందరిపైనా ఆగ్రహంతో దాడి చేశాడని చెబుతున్నారు. ఈ క్రమంలో తన స్నేహితురాలిని చంపడం గమనార్హం.
ఈ సమయంలో తీవ్ర ఆగ్రహంలో ఉన్న అఫాన్.. మొదట తన ఇంట్లో ఉన్న తల్లి, అతని స్నేహితురాలిపై పదునైన వస్తువుతో దాడి చేశాడని తెలుస్తోంది. అనంతరం.. తన తమ్ముడు (13)ని సుత్తితో కొట్టి చంపాడని చెబుతున్నారు. అనంతరం తన ఇంటి నుంచి బయలుదేరిన అఫాన్.. తన మామ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ తన మామ, అత్తలతో కాసేపు వాదన చేశాడు!
అనంతరం ఇద్దరినీ చంపాడని చెబుతున్నారు. ఆ తర్వాత తన మామ ఇంటి నుంచి బయలుదేరి.. తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి.. అక్కడ ఆమెను కూడా చంపాడు. అయితే... ఈ ఆరుగురిలో క్యాన్సర్ వ్యాదితో బాదపడుతున్న అఫాన్ తల్లి మాత్రం ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతుండగా.. మిగిలిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... తన తండ్రి అప్పు విషయంలో ఇంట్లో గొడవ జరిగిందని.. దీంతో, ఎవరూ బతకకూడదని నిర్ణయించుకున్నట్లు అఫాన్ తెలిపాడని అన్నారు. ఈ సమయంలో సహాయం కోసం తన తల్లి, అమ్మమ్మ, బంధువులను సంప్రదించగా.. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని చెప్పాడని తెలిపారు.
అయితే... అఫాన్ ఇంటి పొరుగువారు స్పందిస్తూ... మంచి స్వభావం గల వ్యక్తి, మృదువుగా మాట్లాడే వ్యక్తిగా అతడిని అభివర్ణించారు. ఈ సందర్భంగా అతని తమ్ముడిని చంపడాన్ని చూసి షాకైనట్లు చెప్పారని అంటున్నారు. అతను అలా చేశాడంటే నమ్మలేకపోతున్నాం అనేది ఇరుగుపొరుగువారి మాటగా చెబుతున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు!