మౌనమే కేసీఆర్ భాష.. గులాబీ పార్టీకి వరమా? శాపమా?

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే వేళలో అసెంబ్లీకి హాజరైన తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత.. అసెంబ్లీ సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.

Update: 2024-09-07 08:30 GMT

అదే పనిగా మాట్లాడే వారితో ఇబ్బంది. మితంగా మాట్లాడే వారితోనూ కొంత ఇబ్బంది ఉంటుంది. ఇదంతా సాదాసీదా ప్రజల వరకు ఓకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన అధినాయకుడు మౌనంగా ఉండటం ఎలాంటి సంకేతాల్ని పంపుతోంది? ఎవరికేమైనా ఫర్లేదు.. తాను మాత్రం మాట్లాడే ప్రసక్తే లేదన్నట్లుగా వ్యవహరించే ధోరణి గులాబీ పార్టీని దెబ్బ తీయనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే వేళలో అసెంబ్లీకి హాజరైన తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత.. అసెంబ్లీ సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే.. ఇప్పటివరకు మళ్లీ మాట్లాడింది లేదు. ఆ మాటకు వస్తే.. ప్రజల ముందుకు కానీ.. మీడియా ముందుకు కానీ వచ్చింది లేదు. ఇదిలా ఉంటే.. గడిచిన కొన్ని నెలలుగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ.. వేటి మీదా కేసీఆర్ స్పందించింది లేదు. ఆయనేం మాట్లాడతారన్న ఆసక్తి తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతోంది.

అయితే.. ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకు గులాబీ బాస్ కేసీఆర్ సైతం మినహాయింపు కాదు. ఆయన మౌనంగా ఉండటం వ్యూహంలో భాగం కావొచ్చు. కానీ.. అవసరమైనప్పుడు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. ప్రభుత్వం ఏదైనా అంశాల్లో ఫెయిల్ అయినప్పుడు బయటకు వచ్చి.. ప్రభుత్వాలకు చురుకు తగిలేలా మాట్లాడాల్సిన బాధ్యత గులాబీ బాస్ మీద ఉంటుంది. కానీ.. అవేమీ పట్టించుకోకుండా తాను.. తన ఫామ్ హౌస్ కే పరిమితం కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

గతాన్ని పక్కాన పెడితే.. గడిచిన వారం.. పది రోజులుగా ఖమ్మం.. నల్గొండ జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ వర్షాలు, ఆ సందర్భంగా విరుచుకుపడిన వరదల కారణంగా లక్షలాది ప్రజల బతుకులు ఆగమాగం అయ్యాయి. మొదటి రెండు రోజులు సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్న వాదనను గులాబీ దండు తెర మీదకు తీసుకొచ్చింది. ఒకవేళ.. అదే నిజమని అనుకుంటే.. అలాంటప్పుడు గులాబీ బాస్ తెర మీదకు వచ్చి.. సహాయక చర్యల కోసం తపిస్తున్న ప్రజలను కేసీఆర్ పరామర్శించటం లాంటివి చేసి ఉంటే ఎలా ఉండేది? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.

ఓవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైతే.. మరోవైపు ఆయన కుమారుడు కమ్ మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో ఉండిపోవటం.. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతైనా.. ప్రజల కోసం తన టూర్ ను క్యాన్సిల్ చేసుకొని వచ్చేసి ఉంటే బాగుండేది. కానీ..అలాంటిదేమీ చేయకుండా తన టీంతో అదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం వల్ల ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది అంటున్నారు.

అవేమీ పట్టనట్లుగా వ్యవహరించే కేసీఆర్ తీరు తెలంగాణ ప్రజల మనోభావాల్ని తీవ్రంగా గాయపర్చినట్లుగా పలువురు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. వారికి ఎలాంటి సాయం అందించాలన్న దానిపై స్పష్టత ఉండాలే తప్పించి.. ఎక్కడో దూరాన ఉండిపోయి.. అక్కడి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేయటం ద్వారా కొంత బజ్ క్రియేట్ చేయటం బాగుంది. అదే సమయంలో గ్రౌండ్ లోనూ అంతేలా పనులు చేసేందుకు వీలుగా గులాబీ సైన్యాన్ని పంపి ఉంటే మరింత మైలేజీ ఉండేదంటున్నారు. అందుకు భిన్నంగా ఉండటం కచ్ఛితంగా డ్యామేజే అన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News