లవ్ చేసినోడితో పెళ్లి కోసం అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి
ఈ మొత్తం ఎపిసోడ్ కు వేదికగా హైదరాబాద్ అయితే.. ఇందులోని పాత్రలు చాలావరకు ఏపీకి చెందిన వారు ఉండటం గమనార్హం.
ఇదో ముదురు చెల్లెలి వ్యవహారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ క్రైం స్టోరీకు సంబంధించిన అంశాలు షాక్ కు గురి చేస్తాయి. తాను ప్రేమించిన యువకుడితో ఆనందకరమైన జీవితం కోసం సొంత అన్నను సుపారీ ఇచ్చి కిడ్నాప్ చేయించిన ముదురుచెల్లెలు అరెస్టు కావటం.. ఆమె భాగోతం బయటకు రావటం సంచలనంగా మారింది. కిరాయి గ్యాంగ్ తో చేతులు కలిపి.. వారికి సుపారి ఇచ్చి.. తనకేమీ తెలీదన్నట్లుగా అమాయకురాలిగా బిల్డప్ ఇచ్చిన చెల్లి.. ఏకంగా రూ.2 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేసింది. కథ అడ్డం తిరిగి కటకటాలు పాలైంది. ఈ మొత్తం ఎపిసోడ్ కు వేదికగా హైదరాబాద్ అయితే.. ఇందులోని పాత్రలు చాలావరకు ఏపీకి చెందిన వారు ఉండటం గమనార్హం.
అసలేం జరిగింది? షాకింగ్ గా మారిన ఈ కిడ్నాప్ వ్యవహారంలోకి వెళితే.. మాచర్లకు చెందిన నిఖిత గచ్చిబౌలిలోని ఒక కంపెనీలో పని చేస్తోంది. అక్కడే పని చేస్తున్న క్రిష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన వెంకటక్రిష్ణతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గచ్చిబౌలిలో ఉండే వెంకటక్రిష్ణపై గతంలో వ్యభిచారం.. డ్రగ్స్ కు చెందిన కేసులు ఉన్నాయి. అతడు జైల్లో ఉన్న టైంలో కరడుగట్టిన నేరగాడైన 31 ఏళ్ల సురేశ్ అలియాస్ సూర్యతో పరిచయమైంది. తమ గ్యాంగులు కిడ్నాప్ చేస్తాయని.. ఏదైనా అవసరం ఉంటే చెప్పాలని వెంకటక్రిష్ణకు చెప్పాడు.
దీంతో వెంకటక్రిష్ణ క్రిమినల్ బుర్రకు కొత్త ఐడియాలు వచ్చాయి. తాను పని చేసే ఎండీ శివశంకరబాబును సురేశ్ గ్యాంగ్ తో కిడ్నాప్ చేయించి..రూ.లక్షలు వసూలు చేసి వదిలేశారు. డిసెంబరులో సురేశ్ తనకు డబ్బుల అవసరం ఉందని.. కిడ్నాప్ పని ఉంటే చెప్పాలని వెంకటక్రిష్ణను సంప్రదించాడు. పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ కావాలన్న ఆలోచనలో ఉన్న వెంకటక్రిష్ణ లవ్వర్ నిఖిత.. బాగా డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేయిస్తే బాగుంటుందని ఆశపడ్డారు. ఇందులో భాగంగా తన సొంత పెదనాన్న కొడుకు.. ప్రైవేటు కంపెనీలో ఇంజినీరుగా పని చేసే సురేంద్రను కిడ్నాప్ చేయాలని చెప్పింది.
సురేంద్రకు ఏటా రూ.కోటి జీతం వస్తుందని.. ఆయన భార్య ఐటీ ఉద్యోగిని అని.. అతడ్ని కిడ్నాప్ చేస్తే భారీగా డబ్బులు వస్తాయని ప్లాన్ చేశారు. తాము వేసుకున్న పథకంలో భాగంగా తన అన్న సురేంద్ర ఇంటి అడ్రస్ తో పాటు ఇతర వివరాల్ని కిడ్నాపర్ల చేతికి వచ్చింది. అయితే.. ఇంటి దగ్గర అతడ్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో.. అతను ఇంటి నుంచి బయటకు వస్తే తమ పని తేలిక అవుతుందని నిఖితకు చెప్పారు.
జనవరి నాలుగున సురేంద్రకు ఫోన్ చేసిన నిఖిత.. ఆఫీసులో తనను ఒకరు వేధిస్తున్నారని.. ఖాజాగూడ చెరువు దగ్గరకు రావాలని ఫోన్ చేసింది. చెల్లికి సాయం చేసేందుకు వచ్చిన సురేంద్రను.. ఆమెతో మాట్లాడుతుండగా.. కిడ్నాపర్లు బెదిరింపులకు పాల్పడి.. కారులో ఎక్కించుకొని పరారయ్యారు. అక్కడే ఉన్న ఇద్దరు జరుగుతున్న దాన్ని చూస్తున్నవారు.. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా.. నిఖిత ఏమీ తెలీనట్లుగా తన సోదరుడ్ని ఎవరో తీసుకెళ్లినట్లుగా చెప్పుకొచ్చారు.
సురేంద్రను తీసుకెళ్లిన కిడ్నాపర్లు.. అతడి భార్యకు ఫోన్ చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిందితులు కడ్తాల్ కు వెళ్లిన తర్వాత వారి కారు బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో నిందితులు సురేంద్ర చేత అతడి భార్యకు వాయిస్ మెసేజ్ పంపి.. ఇంకో కారు పంపాలని కోరారు. ప్లాన్ ప్రకారం ఆ కారును తీసుకెళ్లిన నిఖిత.. ఆమె లవ్వర్ లు సురేంద్రను కడ్తాల్ లోని కిడ్నాపర్లకు అప్పగించారు. ఆ తర్వాత వారిద్దరూ కోళ్లు తరలించే వెహికిల్ లో హైదరాబాద్ కు ఇంటికి చేరుకున్నారు.
అయితే.. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు కిడ్నాప్ చేసిన సురేంద్ర ప్రయాణిస్తున్న కారును అడ్డుకోవటంతో.. వారు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో.. చేజ్ చేసిన పోలీసులు కారును అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లలో ఒకరైన రోహిత్.. కిడ్నాప్ కు గురైన సరేంద్ర పోలీసులకు దొరికారు. మిగిలిన ముగ్గురు పరారయ్యారు. సరేంద్ర చెప్పిన వివరాల్ని.. రాయదుర్గం పోలీసులకు చెప్పగా.. వారు కేసును విచారించగా.. కిడ్నాప్ ప్లాన్ చేసిన నిఖిత.. వెంకటక్రిష్ణతో పాటు సురేంద్ర.. రాజులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి చావు తెలివితేటలు ప్రదర్శించిన ముదురు చెల్లెలు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తోంది.