తెలంగాణకు సరికొత్త 'దినోత్సవం': ఉత్తర్వులు జారీ
ఇప్పుడు తాజాగా మరో 'దినోత్సవం' పేరుతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశానికి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి కొన్ని దినోత్సవాలు ఉన్నట్టుగానే రాష్ట్రాల కు కూడా ఉంటాయి. తెలంగాణను తీసుకుంటే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పేరిట కొన్నాళ్లుగా ఉత్సవాలు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నాయకులు విమోచన దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఇలా ప్రత్యేక సందర్భాలతో రాష్ట్రాల్లోనూ దినోత్సవాలు జరుగుతుంటాయి. ఇప్పుడు తాజాగా మరో 'దినోత్సవం' పేరుతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక, నుంచి ఫిబ్రవరి 4వ తేదీని 'సామాజిక న్యాయ దినోత్సవం'గా ప్రకటిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆ రోజు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పండగగా నిర్వహించాలని పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశా లల్లో సామాజిక న్యాయంపై చర్చలు, ఇష్టాగోష్టులతోపాటు.. మేధావులతో ఉపన్యాసాలు ఇప్పించడం, సామాజికంగా వెనుక బడిన వర్గాల ఉన్నతికి తీసుకున్న ప్రభుత్వ చర్యలను వివరించడంతోపాటు... అప్పటి వరకు జరిగిన కార్యక్రమాల ద్వారాలబ్ధి పొందిన వారి వివరాలను కూడా పేర్కొనాలని స్పష్టం చేసింది.
ఇలా ఎందుకు?
ఈ నెల(ఫిబ్రవరి) 4వ తేదీన.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 'కుల గణన' నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను చేపట్టారు. ఎన్ని కులాలు ఉన్నాయి? ఏయే కులాల్లో జనాభా ఎక్కువగా ఉంది? ఏయే కులాలు వెనుకబడి ఉన్నాయి? ఉద్యోగాలు, వృత్తులు, ఆదాయం, ఆయా సామాజిక వర్గాల్లో అక్షరాస్యత, మహిళల శాతం, బాల బాలికలు ఇలా.. అన్ని వివరాలు తెలుసుకున్నారు.
దీని ప్రకారం బీసీలు ఎక్కువగా ఉన్నారని సర్కారు తేల్చింది. వారికి 42 శాతం రిజర్వేషన్ ఫలాలు అందాలని తీర్మానం చేసి.. కేంద్రానికి కూడా పంపింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. కుల గణన నివేదికకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఫిబ్రవరి 4వ తేదీని రాష్ట్ర ప్రభుత్వ సామాజిక దినోత్సవం పేరిట నిర్వహించాలని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయా న్ని అన్ని జిల్లాల కలెక్టరేట్లు, సబ్ కలెక్టర్ కార్యాలయాలు, పంచాయతీల్లో ప్రదర్శించాలని పేర్కొంది.