సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉన్నారా... ఇదొక్కసారి చదవండి!
అవును... సోషల్ మీడియా వల్ల పలు దుష్ప్రభావాలు ఉన్నాయని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా అనేది వైరల్ ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. పదేళ్ల చిన్నారి నుంచి పండు ముసలివారి వరకు ఆల్ మోస్ట్ అందరికీ సోషల్ మీడియాలో అకౌంట్ ఉండడం సర్వసాధారణమై పోయింది. ఈ క్రమంలో కొంతమంది ఈ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిపోతున్న సంగతి తెలిసిందే. రోజులో ఎన్నో గంటల పాటు ఈ ప్రపంచంలో గడపడమే ప్రపంచంగా బ్రతుకుతున్నవారూ పెరిగిపోతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా యూజర్ల విషయంలో మానసిక నిపుణులు కీలక విషయాలు చెబుతున్నారు.
అవును... సోషల్ మీడియా వల్ల పలు దుష్ప్రభావాలు ఉన్నాయని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా... సోషల్ మీడియాలో చేసే పోస్టులను అదేపనిగా చూడడం వల్ల ఆత్మన్యూనత, అభద్రత భావం వంటి మానసిక సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో... సోషల్ మీడియాలో ఉండేదంతా నిజమేనన్న భావనలో కొంతమంది తమను తాము తక్కువ చేసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో సోషల్ మీడియా అనేది వ్యక్తి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా... జర్మన్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, రూర్ వర్సిటీకి చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో... సోషల్ మీడియా వాడకాన్ని ఎంత తగ్గిస్తే, మానసిక ఆరోగ్యం అంత మెరుగుపడుతుందని తేలిందని తెలుస్తుంది.
సోషల్ మీడియా వాడకాన్ని ఎంతగా తగ్గిస్తే, అంతగా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని.. రోజులో కనీసం 30 నిమిషాలైనా సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకుంటే చాలా మంచిదని.. దీనిద్వారా పనిపై ఏకాగ్రత పెరగడంతో పాటు, చేసే పనిలో సంతృప్తి దక్కుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
తాజాగా "బిహేవియర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ" జర్నల్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం సుమారు 166 మందిని ఎంపికచేసి పరిశీలించారంట నిపుణులు. ఇందులో భాగంగా ఎంపిక చేసుకున్నవారిలో సగం మందిని ఒక గ్రూప్ గా చేసి వారిని సోషల్ మీడియా వాడకం 30 నిమిషాలు తగ్గించమని చెప్పగా.. మిగిలిన సగం మందిని యథావిధిగా వాడమని చెప్పారట.
ఈ సమయంలో పరిశోధనకు ముందు, పరిశోధన తర్వాత ఆ సభ్యులను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు సేకరించారు. ఈ సమయంలో వీరిలో సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించిన గ్రూప్ సభ్యులు తమ మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, ఉద్యోగంలో సంతృప్తి ఉందని చెప్పారట. దీంతో సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.