అల్లు అర్జున్ విడుదలపై జైళ్ల శాఖ డీజీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
"పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
దీంతో.. అల్లు అర్జున్ తరుపు న్యాయవాదులు రూ.50 వేల పూచికత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించారు. అయితే.. నాడు హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు రాత్రి ఆలస్యంగా అందాయని.. అందుకే ఆ రోజు అల్లు అర్జున్ విడుదల జరగలేదనే కామెంట్లు వినిపించాయి. దీంతో.. మరుసటి రోజు విడుదలయ్యారు.
ఈ సమయంలో అప్పట్లో ఈ విషయమోపై రకరకాల అభిప్రాయాలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేశాయని అంటారు. బెయిల్ వచ్చినా కూడా ఒక రాత్రి జైల్లో ఉండాల్సి రావడం వెనుక ఏదో బలమైన శక్తి పనిచేసిందనే కామెంట్లూ వినిపించాయని అంటారు. ఈ సమయంలో తాజాగా జైళ్ల శాఖ ఐజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును.. జైళ్ల శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా స్పందించిన డీజీ సౌమ్యా మిశ్రా.. అల్లు అర్జున్ అరెస్టు, విడుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ విడుదల విషయంలో జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదని.. ఆయనను చట్ట ప్రకారమే విడుదల చేయడం జరిగిందని ఆమె అన్నారు.
ఇక గత ఏడాది 41,138 మంది ఖైదీలు జైలులో ఉన్నారని చెప్పిన సౌమ్యా మిశ్రా.. వారిలో హత్య కేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. ఫోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక.. 1,045 మంది ఖైదీలకు ఉచిత న్యాయ సలహా సేవలు అందించినట్లు వెల్లడించారు.
ఇదే క్రమంలో... నార్కోటిక్ డ్రగ్స్, ఎన్.డీ.పీ.సీ. కేసుల్లో 5,999 మంది పురుషులు.. 312 మంది మహిళలు జైళ్లలో ఉన్నారని ఆమె వివరించారు. అదేవిధంగా... 2024లో 30,153 కేసులు కోర్టు విచారణలో ఉండగా.. 483 మందిని విడుదల చేశామని.. 303 మందికి పెరోల్ ఇచ్చామని సౌమ్యా మిశ్రా వెళ్లడించారు.