హాట్ టాపిక్... స్తంభించిన కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్స్!

దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో ఊహించని వ్యవహారం తెరపైకి వచ్చింది.

Update: 2024-02-16 08:35 GMT

దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో ఊహించని వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా తమ పార్టీ బ్యాంకు అకౌంట్స్ స్తంభించాయంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ తో పాటు యూత్ కాంగ్రెస్ అకౌంట్స్ కూడా స్తంభించాయని కీలక ఆరోపణలు చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ విషయంపై ఆ పార్టీ ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవును... దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నడుస్తోన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా తమ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభించాయని.. వాటిలో యూత్‌ కాంగ్రెస్‌ అకౌంట్స్ కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో... ఇది పూర్తిగా ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే చర్య అంటూ అజయ్‌ మాకెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అకౌంట్లను ఆదాయపన్ను శాఖ స్తంభింపజేసిందని తెలిపారు.

ఈ విషయాలపై ఘాటుగా స్పందించిన మాకెన్... సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి, కరెంటు బిల్లులు కట్టడానికి సైతం ప్రస్తుతం తమ చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని అన్నారు. భారత్ న్యాయ యాత్రతో పాటు పార్టీకి చెందిన రాజకీయ కార్యక్రమాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. తాము జారీ చేసిన చెక్కులు రిజక్ట్ అవ్వడంతో ఈ విషయం తమకు తెలిసిందని.. ఇందులో భాగంగా... కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌ బ్యాంకు అకౌంట్స్ ఫ్రీజ్‌ అయ్యాయని తెలిల్పారు.

ఇదే సమయంలో... క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బు నిలిచిపోవడం దారుణం అని చెప్పిన మాకెన్... ఈ నిర్ణయం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, తమ ఎన్నికల సంసిద్ధతను దెబ్బతీసేందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్నట్లుగా మాకెన్ మండిపడ్డారు. ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.

ఇదే క్రమంలో... బీజేపీ సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వినియోగిస్తారు కానీ... తాము మాత్రం క్రౌండ్ ఫండింగ్ ద్వారా సమీకరించుకున్న నిధుల్ని అడ్డుకుంటారా అని ప్రశ్నిస్తూ... దీనిపై తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు! అయితే... రూ.210 కోట్ల పన్ను రికవరీ నిమిత్తం ఈ అకౌంట్లను ఆదాయపన్ను శాఖ ఫ్రీజ్‌ చేసినట్లు తెలుస్తోంది.

కాగా... రాజకీయ పార్టీలు విరాలాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పు వచ్చిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆసక్తిగా మారింది. అయితే... తమ బ్యాంక్ అకౌంట్స్ పనిచేయడంలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సుమారు గంట తర్వాత.. ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్ వాటిని పునరుద్ధరించిందని తెలుస్తుంది.

Tags:    

Similar News