కిడ్నాప్ గ్యాంగులతో లాలూకు సంబంధం... ఆయన బావమరిది ఆరోపణలు!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పై ఆయన బావమరిది, మాజీ ఎంపీ సుభాష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పై ఆయన బావమరిది, మాజీ ఎంపీ సుభాష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న వేళ ఆయన ఆరోపణలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. మరోపక్క.. ఇంకో బావమరిది మాత్రం లాలూను వెనకేసుకొస్తున్నారు.
అవును... రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కు.. డబ్బుల కోసం కిడ్నాప్ గ్యాంగ్ లతో సంబంధాలు ఉండేవని ఆరోపించారు ఆయన బావమరిది సుభాష్ యాదవ్. అలాంటి వ్యక్తులు తనపై కిడ్నాప్ ఆరోపణలూ చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
నాడు అధికారం మత్తులో వారు అలా ప్రవర్తించారని సుభాష్ యాదవ్ పేర్కొన్నారు. అనంతరం.. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే.. తాను కూడా ఆయనలా జైలుకు వెళ్లడానికి సిద్ధమని సుభాష్ యాదవ్ పేర్కొన్నారు.
ఆయన ఆరోపణలు అలా ఉంటే.. లాలూ మరో బావమరిది, రబ్రీదేవి మరో సోదరుడు సాధు యాదవ్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. తన సోదరుడు సుభాష్ యాదవ్.. తమ బావ లాలూపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నుంచి అందిన ముడుపుల మేరకే ఆయన ఈ తరహ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదే సమయంలో.. సుభాష్ యాదవ్ కు కిడ్నాపర్లతో సంబంధాలు ఉన్నాయని తాను నమ్ముతున్నానని అన్నారు. ఇక.. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం బీహార్ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపించదని.. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో లాలూ ప్రసాద్ తిరిగి అధికారం చేపడతారనే విశ్వాసం తనకుందని పేర్కొన్నారు.
దీంతో... ఇరువురు బావమరుదుల నడుమ లాలూ రాజకీయం ఈ ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను అందిస్తుందనేది వేచి చూడాలి.