చిరంజీవిపై సుమన్‌ సంచలన వ్యాఖ్యలు

తాజాగా తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సినీ ప్రముఖుల పారితోషికాలతో రాజకీయ నేతలకు సంబంధం ఏమిటని నిలదీశారు.

Update: 2023-08-25 09:16 GMT

ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ సభలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా, రోడ్లు, అభివృద్ధి, ప్రజలకు మేలు తదితర అంశాల గురించి ఆలోచించకుండా సినీ రంగంపై పడతారేంటి అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. చిరంజీవి ఎవరి పేరు పెట్టి వ్యాఖ్యలు చేయకున్నా వాటిని తమకు తాము వర్తింపజేసుకున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చిరంజీవి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని అయితే సినీ రంగంలో ఉన్న కొంతమంది పకోడీగాళ్లు తమకు సలహాలిస్తున్నారని మండిపడ్డారు.

కాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ వ్యాఖ్యానించారు. తాజాగా తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సినీ ప్రముఖుల పారితోషికాలతో రాజకీయ నేతలకు సంబంధం ఏమిటని నిలదీశారు.'మా పారితోషికాలపై మాట్లాడడం మానుకోండి, సినీ ప్రముఖుల పారితోషికాలకు, రాజకీయాలకు ఏంటి సంబంధం... సినీ పరిశ్రమ వాళ్లు పకోడీగాళ్లు కాదు, అలా విమర్శించిన వాళ్లే బజ్జీగాళ్లు' అని సుమన్‌ మండిపడ్డారు.

రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదని సుమన్‌ అన్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ను కూడా టార్గెట్‌ చేసి మాట్లాడడం బాధ కలిగించిందని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేని రజనీకాంత్‌ పై ఎందుకు బురద చల్లుతున్నారని ప్రశ్నించారు.

పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై స్పందిస్తూ... రాజకీయ నాయకులకే రెండు, మూడు కుటుంబాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పేర్లు తాను వెల్లడించనన్నారు. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు రాజకీయం చేయకూడదన్న చట్టం ఉందా? అని సుమన్‌ నిలదీశారు.

కొన్ని కారణాల వల్ల ఇంకో వివాహం చేసుకోవాల్సి వస్తుందని.. దాన్ని తప్పుబట్టి పవన్‌ పై బురద చల్లడం సమంజసం కాదన్నారు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి బాధ? అని నిలదీశారు. పవన్‌ మాజీ భార్యలు తమకు న్యాయం చేయాలని మిమ్మల్ని ఏమైనా కోరారా? అని సుమన్‌ ప్రశ్నించారు. పలు పెళ్లిళ్లు చేసుకున్నవారు చాలా మంది ఉన్నారని.. దమ్ముంటే వారిపై కామెంట్‌ చేయాలని సుమన్‌ సవాల్‌ విసిరారు.

రాజకీయంగా పవన్‌ ను ఎదుర్కోవాలేగాని, వ్యక్తిగతంగా దూషించడం సరికాదని సుమన్‌ సుతిమెత్తగా చురకలు అంటించారు. చంద్రబాబు విజన్‌ ఉన్న వ్యక్తి అని.. ఏపీని అన్ని విధాలుగా ఆయనే అభివృద్ధి చేశారని సుమన్‌ గుర్తు చేశారు.

కాగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించిన సుమన్‌ ప్రస్తుతం వివిధ భాషా చిత్రాల్లో విలన్‌ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఇప్పుడు సుమన్‌ విమర్శల నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News