ఆరు నెలలలో సూపర్ సిక్స్ అట... ఇలా అయితే నెలలోనే వ్యతిరేకత ?

సూపర్ సిక్స్ అంటూ టీడీపీ తెగ ఊ దరగొట్టింది. దానినే ఎన్నికల్లో ప్రచారం కూడా చేసుకుంది.

Update: 2024-06-13 10:29 GMT

సూపర్ సిక్స్ అంటూ టీడీపీ తెగ ఊ దరగొట్టింది. దానినే ఎన్నికల్లో ప్రచారం కూడా చేసుకుంది. జనాలు బాగా నమ్మారు. ముఖ్యంగా మహిళా లోకం అయితే సూపర్ సిక్స్ పధకాలకు పడిపోయారు. వృద్ధులు అయితే నాలుగు వేల పెన్షన్ కి ఫిదా అయ్యారు. వారి ఓట్లు ఎలా వెల్లువలా వచ్చి పడ్డాయో పోలింగ్ రోజున సన్నివేశాలే చెప్పాయి.

మండే ఎండలను కూడా తట్టుకుని గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేశారు. రాత్రి పొద్దు పోయిన దగ్గర నుంచి తెల్లవారు జాము దాకా పోలింగ్ ఒక స్థాయిలో జరిగింది. ఇదంతా వైసీపీకి అనుకూలం అని అనుకున్నారు. కానీ టీడీపీకే ఫేవర్ అయింది. కూటమి బంపర్ విక్టరీ కొట్టింది.

మొత్తం మీద చంద్రబాబు ఏపీలో నాలుగో సారి అధికారంలోకి వచ్చారు. ఆయన ఎన్నికల్లో చెప్పినట్లుగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తప్పకుండా నెరవేర్చాలి. అది కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గద్దెనెక్కిన వెంటనే చేయాల్సి ఉంది. జనాలు కూడా వాటి కోసమే ఎదురు చూస్తున్నారు.

ఈ సూపర్ సిక్స్ పధకాల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిది తల్లికి వందనం, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇరవై వేలు వంతున చదువు కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయమే ఈ పధకం. విద్యా సంవత్సరం మొదలైంది కాబట్టి చాలా ఖర్చులు ఉంటాయి.దాంతో ఈ పధకం గురించే ఆలోచిస్తున్నారు తల్లులు.

అలాగే 18 ఏళ్ళు నిండిన ప్రతీ మహిళకూ నెలకు 1500 ఆర్ధిక సాయం చేసే మరో పధకం ఉంది. అంటే ఏడాదికి 18 వేలు అన్న మాట. ఇది కూడా అమలు చేస్తే ఆ నిధులు అందుకోవాలని ఆశ పడుతున్నారు. అలాగే ప్రతీ ఇంటికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదిలో ఉచితంగా ఇవ్వడం. ఈ పధకం కూడా పాపులర్ అయింది.

మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం. దీని కోసం అయితే చాలా ఆశగా చూస్తున్నారు. అలాగే రైతులకు భరోసా సాయం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం. ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు. అది కాకపోతే ప్రతీ నెలా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి.

ఇక వృద్ధుల సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంచడం, అలాగే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచడం, బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎంతో ఆర్ధిక భారంతో కూడుకున్నవి.

మరి వీటిని ఆరు నెలల టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకుని అమలు చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తోంది. అయితే అంతవరకూ జనాలు ఆగుతారా అన్నదే ఇక్కడ ప్రశ్న. తెలంగాణాలోనే చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య ఫలితాల్లో తేడా వచ్చింది. రైతులకు రుణ మాఫీ చేయలేదని ఆరోపిస్తూ బీజేపీ రాజకీయంగా లాభపడింది.

అలాగే కర్నాటకలో ఉచిత పథకాలు హామీలు అమలు కాలేదనే అక్కడ కాంగ్రెస్ కి 7 ఎంపీ సీట్లే జనాలు ఇచ్చారు. ఈ విధంగా చూస్తే జనాల కరుణా కోపం రెండూ పక్కనే ఉంటాయి. ప్రజలు ఆశపోతులని అనుకోవచ్చు. అదే ఆశను ఆరాటాన్ని నాయకులు ఓట్ల రూపంలో మార్చుకుని అధికారం పొందినపుడు ప్రజల ఆశలకూ అర్ధాలు ఉండవా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు వీలు అయినంత తొందరగా సూపర్ సిక్స్ పధకాలను అమలులో పెట్టకపోతే అది టీడీపీ కూటమికే చేటు అని అంటున్నారు. అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన వైసీపీ ఊరుకోదు. పైగా తాము చెప్పిన నవరత్నాలు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేశామని చెప్పుకోవడానికి ట్రాక్ రికార్డు ఆ పార్టీకి ఉంది.

ప్రతిపక్షం బలంగా ఉందా లేదా అని కాదు ప్రజలే ఎపుడూ ప్రతిపక్షాలు అది అర్ధం చేసుకుని కూటమి పెద్దలు చేయాల్సింది ఏదో చేయాల్సిందే. ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే అంటున్నారు. లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు. ఏ ప్రభుత్వానికి అయినా తొలి ఆరు నెలల సమయం చాలా ముఖ్యం. మైర్ అది కాదు అనుకుంటే హానీమూన్ ముగుస్తుంది. హాహాకారాలు జనంలో మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News