రోడ్డు రోలర్, చపాతి మేకర్, కారు... బీఆర్‌ఎస్ కు సుప్రీంకోర్టుకు షాక్!
ఈ నేపథ్యంలో తమకు హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ తరపు న్యాయవాదులు కోరగా.. కావాలంటే హైకోర్టుకు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తమ ఎన్నికల చిహ్నమైన ‘కారు’ను పోలిన గుర్తులు ఎవరికీ కేటాయించవద్దని, ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని, అలాగే ఇప్పటికే ఎవరికైనా తమ కారును పోలిన గుర్తులు కేటాయించి ఉంటే వాటిని రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఓటర్లకు అన్నీ తెలుసని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా.. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్ పై ఆలస్యంగా వచ్చారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. ఒక రాష్ట్రంలో అధికార పార్టీ అయివుండి.. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారని సుప్రీం ధర్మాసనం నిలదీసింది. పిటిషన్ పై విచారణ చేపట్టడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టింది.
ఈ నేపథ్యంలో తమకు హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ తరపు న్యాయవాదులు కోరగా.. కావాలంటే హైకోర్టుకు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే మెరిట్స్ ఆధారంగానే అక్కడ కూడా విచారణ ఉంటుందని తేల్చిచెపింది.
ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు కేటాయించే గుర్తు విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, ట్రక్ ట్రాలీ, ట్రక్ ఆటో, వ్యాన్, చపాతి మేకర్ వంటి గుర్తులను ఎన్నికల్లో కేటాయించవద్దని కోర్టుకు విన్నవించింది.
బీఆర్‌ఎస్ విచారణపై చేపట్టిన ధర్మాసనం ఈ పిటిషన్ ను తిరస్కరించింది. విచారణ సందర్బంగా న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం బీఆర్‌ఎస్ వాదనలను కొట్టివేసింది. కారు, రోటీ మేకర్ గుర్తులకు తేడా తెలుసుకోలేనంత అమాయకులు ఓటర్లు కాదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్లకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించింది.
కాగా.. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించారు. ఎన్నికల్లో కారును పోలిన గుర్తులకు వేల సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. దీంతో బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. త్రిముఖ పోటీలో పదులు, వందల సంఖ్యలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని సుప్రీంకోర్టును కోరింది.