రవి అస్తమించని సామ్రాజ్యంలో ఈసారి గెలుపెవరిది?

మనదేశంలో మాదిరిగానే ప్రధానికే బ్రిటన్‌ లో కీలక అధికారాలు ఉంటాయి.

Update: 2024-06-28 15:30 GMT

రవి అస్తమించని సామ్రాజ్యంగా బ్రిటన్‌ కు పేరు. మనదేశాన్ని 200 ఏళ్లకు పైగా పరిపాలించిన ఆ దేశానికి ఇప్పుడు ఒక భారతీయుడు రిషి సునాక్‌ ప్రధానమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. మనదేశంలో మాదిరిగానే ప్రధానికే బ్రిటన్‌ లో కీలక అధికారాలు ఉంటాయి.

ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీ కన్జర్వేటివ్‌ పార్టీని రిషి సునాక్‌ గెలిపించాల్సిన బృహత్తర బాధ్యత ఆయనపై ఉంది. అయితే అదంత సులువు కాదన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. మళ్లీ ఎన్నికల్లో గెలుపొంది బ్రిటన్‌ ప్రధాని పదవిని చేపట్టడంలో రిషి సునాక్‌ కు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

గత కొన్నాళ్లుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంరలో రిషి సునాక్‌ తప్పటడుగులు వేశారని విశ్లేషకులు అంటున్నారు. ఈసారి జూలై 4న ఎన్నికలు జరుగతాయని పందెం కాసిన కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థులను రిషి సునాక్‌ సస్పెండ్‌ చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

అలాగే జూన్‌ 6న ఫ్రాన్స్‌ లోని నార్మండీలో జరిగిన డి–డే ఉత్సవ కార్యక్రమం నుంచి త్వరగా వెళ్లిపోవడం కూడా రిషి సునాక్‌ కు ఇబ్బందిగా మారింది. బ్రిటన్‌ ప్రధాని చర్య అమరవీరుల త్యాగాలను అగౌరవపరచడమేనని విమర్శలు చుట్టుముట్టాయి. ఈ విషయంలో రిషి సునాక్‌ క్షమాపణ చెప్పినా ప్రయోజనం దక్కలేదు.

Read more!

ఇంకో ముఖ్య అంశం... ఇప్పటిదాకా జరిగిన సర్వేలు, పోల్స్‌ అన్నీ కూడా కన్జర్వేటివ్‌ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. రిషి సునాక్‌ తోపాటు, పార్టీకి ప్రజాభిమానం తగ్గిపోయిందని సర్వేలు చెబుతున్నాయి.

మరోవైపు గత 14 ఏళ్ల నుంచి బ్రిటన్‌ లో కన్జర్వేటివ్‌ పార్టీనే అధికారంలో ఉంది. దీంతో లేబర్‌ పార్టీ ఈసారి ఎలాగైనా గెలుపు సాధించి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది.

బ్రిటన్‌ లో ఆర్థిక మాంద్యం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఐదో స్థానంలో ఉన్న ర్యాంకును పోగొట్టుకుని ఆరో స్థానానికి పడిపోవడం, బ్రెగ్జిట్‌ నుంచి తప్పుకోవడం, యూరోపియన్‌ యూనియన్‌ తో సమస్యలు, రష్యా – ఉక్రెయన్‌ యుద్ధానికి సంబంధించి రష్యాతో ఉన్న పేచీలు, వలసలను భారీ తగ్గించాలని నిర్ణయించడం.. ఇలా ఒకటి రెండు కాదు.. చాలా సమస్యలు రిషి సునాక్‌ ను చుట్టుమడుతున్నాయి.

ఈ నేపథ్యంలో 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుందని సర్వేలు ఢంకా బజాయిస్తున్నాయి. ఎంపీగా సునాక్‌ కు కూడా ఓటమి తప్పదనే వారూ ఉన్నారు.

మరోవైపు అధికారమే లక్ష్యంగా లేబర్‌ పార్టీ చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతోంది. 14 ఏళ్ల కన్జర్వేటివ్‌ పార్టీ పాలన తర్వాత ప్రభుత్వంలో మార్పు కోసం బ్రిటీషర్లు తహతహలాడుతున్నారని అంటున్నారు. అయితే లేబర్‌ పార్టీ ప్రణాళికలు అంతగా గొప్ప లేకపోవడం బ్రిటిషర్లను కొంత నిరుత్సాహపరుస్తోంది

ఇక ప్రధానిగా ఇప్పటికీ 72 శాతం మంది రిషి సునాక్‌ కే మద్దతు పలుకుతున్నారు. 51 శాతం మంది లేబర్‌ పార్టీ నాయకుడు కీర్‌ స్టారమర్‌ పై ఆసక్తి చూపుతున్నారు.

కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున గతంలో వినస్టన్‌ చర్చిల్, మార్గరెట్‌ థాచర్, బోరిస్‌ జాన్సన్‌ ప్రధానులుగా పనిచేశారు. ఆ పార్టీ 1906లో సాధించిన 141 సీట్ల కంటే ఈసారి తక్కువ సీట్లే గెలుస్తుందని అనేక సర్వేలు తేల్చిచెబుతున్నాయి. 1834లో కన్జర్వేటివ్‌ పార్టీ ఏర్పడ్డాక ఇదే దారుణ ఫలితమవుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్‌ రికార్డులను తిరగరాయగలరా? లేక చరిత్రలో కలిసిపోతారా అనేది త్వరలోనే తేలనుంది.

Tags:    

Similar News

eac