పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన ?
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జనసేన పార్టీ నేతలు తమ వాహనాలకు స్టిక్కర్లు అంటించుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నారు.
పిఠాపురం అంటేనే ఇపుడు గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జనసేన పార్టీ నేతలు తమ వాహనాలకు స్టిక్కర్లు అంటించుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా వారికి పిఠాపురం ఎమ్మెల్యేగానే ఎక్కువ అభిమానం. పిఠాపురం అంటే పవన్. ఈ విషయంలో రెండో మాటకు తావు లేదు అన్నట్లుగా ఉన్నారు.
మరి బయట జనసైనికులే అలా ఉంటే పిఠాపురంలో జనసైనికులు ఎంత తీవ్రంగా పట్టించుకుంటారో వేరేగా ఆలోచించాల్సినది లేదు. పిఠాపురంలో జనసేన నేతలు మొత్తం తమ సత్తా చూపిస్తున్నారు. అన్నింటా తమ హవా సాగాలని కోరుకుంటున్నారు. అయితే 2014లోనే అక్కడ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా నెగ్గి మంచి బలం బలగం ఉన్న టీడీపీ నేత వర్మ వర్గం చూస్తూ ఊరుకుంటుందా. దాంతోనే రచ్చ రంజుగా సాగుతోంది అని అంటున్నారు.
పిఠాపురంలో వర్మ ఇపుడు అధికారంలో పార్టీ ఉండటంతో తన చొరవ చూపిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గం సమస్యలు అన్నీ అవగాహన ఉంది. దాంతో ఆయన అధికారులతో కలసి పనులు చేయిస్తున్నారు. అలా వర్మ తన హవాను చాటుకుంటున్నారు. ఇది జనసైనికులకు గిట్టడం లేదు అని అంటున్నారు. వారు అయితే వర్మ కాదు ఎమ్మెల్యే జనసేనది ఈ సీటు అని అధికారులతో అనడమే కాదు జనసేన మాట వినాలని గట్టిగా కోరుతున్నారుట.
ఈ మధ్యలో అధికారులు పడి నలిగిపోతున్నారు. అంతే కాదు అధికారికంగా జనసేన నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా వర్మను పిలవడం లేదు అని వర్మ అనుచరులు మండిపడుతున్నారు. మా నాయకుడు త్యాగం చేయడం వల్లనే ఈ సీటు జనసేనకు వెళ్ళిందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ డిప్యూటీ సీఎం. పైగా ఆయన కూటమిలో కీలకంగా ఉన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయనకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. దాంతో జనసైనికులు కూడా తమ మాటే పిఠాపురంలో నెగ్గాలని చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ విషయంలో ఒక రకంగా జనసేన లోకల్ లీడర్స్ కాస్తా ఎడం పాటిస్తున్నారు. టీడీపీ నేతలు కూడా అంతే దూరం పాటిస్తున్నారు.
దాంతో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలు రెండుగా చీలి కత్తులు దూస్తున్నాయని అంటున్నారు. జనసేనకు పవన్ కి ఇది పర్మనెంట్ సీటు అని పవన్ రాజకీయల్లో ఉన్నంతవరకూ పిఠాపురం వదలరని అంటున్నారు. దాంతో వర్మకు ఏ రకంగానూ రాజకీయంగా ఎలివేషన్ లేకుండా పోతోంది అని ఆయన వర్గం మధన పడుతోంది. ఎమ్మెల్సీ సీటు కూడా వర్మకు దక్కలేదు. మరి ఫ్యూచర్ లో వస్తుందో రాదో తెలియదు.
దాంతో ఆయన తన అనుచరులు తన క్యాడర్ ని కాపాడుకోవడానికి గట్టిగానే తిరుగుతున్నారు. ఆయన చంద్రబాబుని పొగుడుతున్నారు. బాబు నాయకత్వం గ్రేట్ అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎన్నికల్లో అంతా కలసి ఒక్కటిగా పనిచేసిన టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే ఈ విధంగా చీలిపోవడం ఒకరి ఆధిపత్యానికి వేరొకరు గండి కొట్టాలని చూడడం చూస్తే టాక్ ఆఫ్ ది టౌన్ గా పిఠాపురం నిలుస్తోంది. పిఠాపురం రాజకీయాన్ని సెట్ చేయకపోతే రానున్న రోజులలో ఎలా ఉంటుందో తెలియదు అని అంటున్నారు.