తేడా కొడుతున్న పిఠాపురం వర్మ కామెంట్స్ ?
మొత్తానికి ఆనాడు చంద్రబాబు ఇచ్చిన హామీతో మెత్తబడిన వర్మ పవన్ గెలుపు కోసం తన వంతుగా పనిచేశారు.
పిఠాపురం వర్మ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసారిగా ఏపీలో మారుమోగారు. అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతు అవసరం పడడంతో ఆయన మీదనే అందరి దృష్టి పడింది. వర్మ అనుచరులు సైతం తమ నేతకు టికెట్ ఇవ్వకపోతే కుదరదు అంటూ చేసిన నిరసన కార్యక్రమాల నేపధ్యంలో ఎవరీ వర్మ అని ఏపీ మొత్తం చూసింది.
మొత్తానికి ఆనాడు చంద్రబాబు ఇచ్చిన హామీతో మెత్తబడిన వర్మ పవన్ గెలుపు కోసం తన వంతుగా పనిచేశారు. ఏపీలో కూటమి ప్రభంజనం వీచడం పవన్ మంచి మెజారిటీతో గెలవడమే కాదు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. మరి వర్మ సంగతేంటి అన్నది ఆయన అనుచరులను దొలుస్తున్న ప్రశ్న.
ఇలా కూటమి గద్దెనెక్కిందో లేదో అలా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి వర్మకే అని అంతా అనుకున్నారు. కానీ వర్మకు కాకుండా వేరే వాళ్ళకు ఆ చాన్స్ వెళ్లింది. దాంతో వర్గం అనుచరులలో ఆందోళన మరింత పెరిగింది.
మరో వైపు పిఠాపురంలో పవన్ ఇళ్ళు కట్టుకుని ఒక ఇంటి వారు అయ్యారు. ఆయన సోదరుడు నాగబాబు పిఠాపురంలో జనసేన బాధ్యతలు చూసుకుంటున్నారు. కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా పిఠాపురం మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఏ విధంగా చూసినా పిఠాపురం మొత్తం జనసేనతో నిండిపోయింది. వర్మకు ఒక విధంగా ఉక్క బోతగా ఉంది.
ఏపీలో పవన్ కి సొంత నియోజకవర్గం లేదు ఆయన పిఠాపురాన్ని ఎంచుకుని తన రాజకీయం మొత్తం అక్కడ నుంచే అన్నీ చేయాలనుకుంటున్నారు. పవన్ కి పిఠాపురానికి అలా బంధం పడిపోయిన వేళ వర్మకు రెడ్ సిగ్నల్స్ ఎటు చూసినా కనిపిస్తున్నాయి. పవన్ సొంత నియోజకవర్గంలో ఆయన్ని కాదని వర్మకు చాన్స్ ఇచ్చే సీన్ టీడీపీకి ఉంటుందా అంటే ప్రస్తుతానికి లేదు అనే చెప్పాలని అంటున్నారు.
పైగా వర్మకి 2014, 2019లో టీడీపీ టికెట్ ఇచ్చింది. ఇపుడు చూస్తే పొత్తులలో భాగంగా జనసేనకే వదిలేసేలా ఉంది అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అది కూడా ఇప్పట్లో ఇస్తారా లేదా అంటే డౌటే. ఈ మొత్తం పరిణామాలను రాజకీయంగా ఆరితేరిన వర్మ విశ్లేషించుకోలేరని వారు అని ఎవరూ అనుకోవడం లేదు. పైగా ఆయన అనుచరులు అభిమానుల ఆవేదన కూడా ఆయనకు తెలుసు అని అంటున్నారు.
దాంతో ఆయన మనసు విప్పి తాజాగా మీడియా ముందు మాట్లాడారు. అందులో పిఠాపురం నా అడ్డా అన్నట్లుగా బిగ్ సౌండ్ చేశారు. విశాఖ నుంచి బయల్దేరే గోదారి ఎక్స్ ప్రెస్ ఎన్నో బోగీలను తగిలించుకుంటుందని అన్నట్లుగా ఆయన పరోక్ష సెటైర్లు ఎవరి మీదనో వేశారు. వారు ఎవరు అన్నది తెలిసిందే.
నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే ఉంటాను రాజకీయం చేస్తాను అని వర్మ గట్టిగానే చెబుతున్నారు. నేను పక్కా లోకల్ అని ఆయన అంటున్నారు. నేను చంద్రబాబుకు సైనికుడి లాంటి వాడిని అని అన్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజలతో సన్నిహితంగా ఉంటాను వారితోనే ఉంటాను అని ఆయన అంటున్నారు.
ప్రజలు ఎపుడు కష్టాలలో ఉంటే వారిని ఆదుకుంటూ వారికి తోడు నీడగా ఉంటాను అని వర్మ అన్నారు. ఎవరో వచ్చి పిఠాపురంలో నా హవాను తగ్గిస్తారు అనుకుంటే అది అయ్యే పని కాదని వర్మ కుండబద్ధలు కొట్టారు. మొత్తానికి చూస్తే వర్మ చేస్దిన ఈ వ్యాఖ్యలు అగ్గి రేపుతున్నాయి. ఆయనకు జనసేన నుంచి తగిన ఆదరణ గౌరవం దక్కడం లేనందువల్ల ఈ రకంగా కామెంట్స్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
మరో వైపు చూస్తే వర్మ బోల్డ్ గా మాట్లాడే టైప్ అని అంటున్నారు. ఆయన ఇపుడు అధికార పక్షంలో ఉన్నారా లేక విపక్షంలో ఉన్నారా అంటే కూడా అర్థం కాని పరిస్థితి అని అంటున్నారు. వర్మకు సముచిత స్థానం కలిపిస్తామని ఎన్నికల వేళ కూటమి పెద్దలు పదే పదే చెబుతూ వచ్చారు.
మరి ఆయనకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదు. నామినేటెడ్ పదవులలో ఏమైనా దక్కుతుందా అంటే ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు మరి నామినేటెడ్ పందేరం దగ్గర పడిన వేళ వర్మ చేసిన కామెంట్స్ గమనార్హమైనవి అంటున్నారు. ఏది ఏమైనా పిఠాపురం వర్మ చేసిన కామెంట్స్ తో ఎక్కడో తేడా కొడుతోందని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు పిఠాపురం నియోజకవర్గం రాజకీయాలు ఎలా ఉంటాయో.