తెలంగాణ గవర్నర్ గా రిటైర్డ్ ఐపీఎస్.. తమిళిసై మళ్లీ తమిళనాడుకు?
తెలంగాణ గవర్నర్ గా 2019 సెప్టెంబరులో తమిళిసై నియామకం అయ్యారు. అంతకుముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు.
ఈ నెల ప్రారంభంలో వెలువడిన ఎన్నికల్లో సంచలనం ఫలితం వచ్చిన తెలంగాణలో మరో కీలక మార్పు చోటుచేసుకోనుందా..? రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై డేగ కన్ను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయేనుందా..? వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామం జరగనుందా? ఇదే తరహా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అనూహ్యంగా రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి
తెలంగాణ గవర్నర్ గా 2019 సెప్టెంబరులో తమిళిసై నియామకం అయ్యారు. అంతకుముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. స్వతహాగా గైనకాలజిస్ట్ డాక్టర్ అయిన తమిళిసై వైద్యురాలిగా విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అనంతరం ఈమె తెలంగాణ గవర్నర్ గా వచ్చారు. తమిళిసై స్థానంలో రిటైర్డ్ ఐపీఎస్ అన్నామలైను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన హయాంలో బీజేపీ తమిళనాడులో బలపడింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, తమిళిసై నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. మరోవైపు 2024 ఏప్రిల్ లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకనే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారని అంటున్నారు. ఇందుకు అనుమతి తీసుకునేందుకు తమిళిసై ఢిల్లీ వెళ్తున్నారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ..
తమిళిసై.. తమిళనాడు పక్కనే ఉండే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా. లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీని తొలగించి తమిళిసైని నియమించారు. కేంద్ర పాలిత ప్రాంతం. వాస్తవానికి ఇక్కడ గవర్నర్ కు సీఎం కన్నా ఎక్కువ అధికారాలు ఉంటాయి. అయినప్పటికీ ఈ రెండు పదవులను వదులుకుని తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లనున్నట్ల చెబుతున్నారు. ఎంపీగా గెలవాలన్న లక్ష్యంతో ఉన్నారు. గతంలో మూడు సార్లు అసెంబ్లీకి. రెండుసార్లు పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు. ఒక్కసారి మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో తూత్తుకూడిలో కరుణానిధి కుమార్తె కనిమొళిపై పోటీచేసి పరాజయం పాలయ్యారు.
బీజేపీ హైకమాండ్ నిర్ణయమా?
తెలంగాణ గవర్నర్ గా తమిళిసైను తప్పించాలన్నది బీజేపీ హైకమాండ్ నిర్ణయం అనే వాదన కూడా వస్తోంది. తమిళిసై స్థానంలో రిటైర్డ్ ఐపీఎస్ ను నియమించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ.. తెలంగాణలో పది పార్లమెంటు సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ రిటైర్డ్ ఐపీఎస్ ఎవరా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ తమిళనాడు చీఫ్ గా ఉన్న అన్నామలై రిటైర్డ్ ఐపీఎస్ కావడం గమనార్హం.
కొసమెరుపు: ఉమ్మడి రాష్ట్రంలో 2010లో గవర్నర్ గా నియమితులైన నరసింహన్ ఐపీఎస్ అధికారే. ఆయన సుదీర్ఘ కాలం అంటే.. దాదాపు 9 ఏళ్లు పైగా గవర్నర్ గా కొనసాగారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ గవర్నర్ గా కొనసాగారు.