పవన్ వీర హిందూత్వ...టీడీపీని కలవరపెడుతోందా ?

ఆయన దేనికీ ఎవరికీ భయపడరు. ఆయన ఈ దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు.

Update: 2024-09-28 04:17 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఒక సగటు మనిషిగానే అంతా చూడాల్సి ఉంటుంది. ఆయనకు ఏ విషయం మీద అయినా కమిట్మెంట్ ఉందంటే దానిని ఆయన ఎక్కడా దాచుకోరు. అంతే కాదు ఆయన బలంగా గట్టిగా చెప్పాల్సిన చోట చెబుతారు. పవన్ స్వభావమే అంత.

ఆయన దేనికీ ఎవరికీ భయపడరు. ఆయన ఈ దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. దేశంలోని సనాతన ధర్మం పట్ల కూడా ఆయనకు ఉన్న అంకితభావం ఏమిటో తాజాగా ఆయన చెప్పిన మాటలు చేసిన ప్రసంగాలు చూస్తే అర్ధం అవుతుంది. పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిన విషయంలో తీవ్రంగా కలత చెందారు అన్నది తెలిసిందే.

అందుకే ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. అంతే కాదు కనకదుర్గమ్మ వారి మెట్లను కడగడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంతే కాదు సనాతన ధర్మం పట్ల చులకనగా మాట్లాడరాదు అని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తాను ఉన్న సినీ సీమలో ఎవరు అయినా ఎలాంటి మాట మాట్లాడినా ఆయన సహించలేకపోయారు. ఆఖరుకు అది ప్రకాష్ రాజ్ అయినా కార్తీ అయినా పవన్ స్టాండ్ ఒక్కటే.

ఆయన ఆవేశంగానే బదులిచ్చారు. మరోవైపు చూసుకుంటే హిందూ ధర్మానికి ఇబ్బంది కలుగుతూంటే హిందువులు అంతా బయటకు రావాలి కదా వారు వచ్చి తమ సంఘీభావం తెలియచేయాలి కదా పవన్ కోరిన తీరు కానీ ఇచ్చిన పిలుపు కానీ ఎన్న తగినదే. ఒక సగటు రాజకీయ నేత నుంచి ఎవరూ ఇలాంటి పిలుపుని ఆశించలేరు. వారి ఎన్నో కొలతలు లెక్కలు పారామీటర్లు పెట్టుకుని ఆలోచిస్తారు.

కానీ ముందే చెప్పుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ని ఎవరూ శంకించలేరు. అయితే పవన్ లో ఈ వీర హిందూత్వ వైఖరి ఆయన ఆవేశం టీడీపీ కూటమిలోని బీజేపీకి అయితే మహా సంతోషంగా ఉంటోంది. కానీ అదే కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీకి మాత్రం ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ లడ్డూ కల్తీ ఇష్యూ తానుగా బయటపెట్టినా ఒక పరిమితికి లోబడే కామెంట్స్ చేసింది.

పైగా టీడీపీ కామెంట్స్ అన్నీ జగన్ చుట్టూనే అల్లుకుని సాగాయి. ఆయననే కార్నర్ చేస్తూ వెళ్లాయి. దాని వల్ల బహువిధాలుగా లాభాలను టీడీపీ ఆశించింది. మధ్యలో పవన్ వీవ హిందూత్వ ఎపిసోడ్ లేకపోయి ఉంటే కనుక టీడీపీ ప్లాన్స్ నూరు శాతం పారేవి. అయితే పవన్ ఆవేశంతో చేసిన కొన్ని కామెంట్స్ వల్లనే ఇపుడు టీడీపీలో చర్చ సాగుతోంది.

అదే సమయంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ లాంటి వారు అంతా పవన్ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. దళితులను ముందుకు తెచ్చి మరీ వారు టీడీపీ కూటమి తీరుని ఎండగట్టారు. అలాగే ఇతర వర్గాల గురించి కూడా వారు మద్దతుగా మాట్లాడుతూ బీజేపీ మూసలోకి టీడీపీ కూటమి వెళ్తోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంకో వైపు చూస్తే పవన్ ప్రవచించిన సనాతన ధర్మం అన్నది కూడా లడ్డూ కల్తీ అయిన ఇష్యూని దాటి ఒక బిగ్ డిబేట్ గా సాగింది. వామపక్షాలు అయితే దీని మీద ఫైర్ అయ్యారు. ఏపీలో అధికారం ఇస్తే మత రాజకీయాలు చేస్తారా అని వామపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. మరో వైపు కొన్ని వర్గాలలో కూడా సందేహాలు రేపేలా ఇటీవల పరిణామాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఆవేశం వెనక అంకితభావం ఉంది. అర్ధం ఉంది. ఆయన రాజకీయ సమీకరణలు లెక్కలు కాకుండా అతీతంగానే మాట్లాడుతారు. దాంతోనే ఇపుడు టీడీపీలో చర్చ సాగుతోంది. పవన్ వీర హిందూత్వ వల్ల ఇబ్బందులు వస్తాయా అని సందేహాలు ఉన్నా కూడా టీడీపీ అయితే ముందుకు సాగిపోవడం తప్ప చేసేది ఏమీ లేదని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ మొదటి మూడు నెలలూ సైలెంట్ గానే ఉన్నారు. ఎన్నికల తరువాత ఆయన మరోసారి తన అవేశాన్ని ప్రదర్శించారు. ఇపుడు అధికారంలో కూటమి ఉంది కాబట్టే అది ఏమైనా వేరే సంకేతాలు ఇస్తుందా అన్నదే మల్లగుల్లాలు పడుతున్నారుట.

Tags:    

Similar News