టీడీపీ, జనసేన రెండో విడత జాబితా అప్పుడేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ, జనసేన కృతనిశ్చయంతో ఉన్నాయి

Update: 2024-03-01 10:06 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ, జనసేన కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెంలో ఇరు పార్టీలు నిర్వహించిన జెండా సభ విజయవంతమైంది. దీంతో మరిన్ని సభలను నిర్వహించడానికి ఈ రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

కాగా ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాలను ప్రకటించాయి. టీడీపీ 94 స్థానాలకు, జనసేన పార్టీ 5 స్థానాలకు అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. జనసేన వచ్చే ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది.

అలాగే టీడీపీ 94 మంది అభ్యర్థులను మొదటి విడతలో ప్రకటించింది. మరో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి 12 అసెంబ్లీ, ఏడు లేదా 8 లోక్‌ సభా సీట్లు కేటాయిస్తారని అంటున్నారు. టీడీపీ ఇంకా ప్రకటించాల్సిన 57 సీట్లలో 12 సీట్లు బీజేపీకి పోగా మిగిలిన 45 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు పొత్తు ఉంటుందో, లేదో ఇంకా బీజేపీ ప్రకటించలేదు. అయితే పొత్తు ఉంటుందనే అంతా అంటున్నారు. మార్చి 4న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి ఎన్డీయే కూటమిలో చేరతారని చెబుతున్నారు. ఆ తర్వాత బీజేపీ కూటమిలో చేరుతుందని సమాచారం.

బీజేపీ కూటమిలో చేరాక ఆ పార్టీ ఎంచుకునే స్థానాలను బీజేపీకి వదిలేసి మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నారు. పవన్‌ ఎంపిక చేసుకున్న స్థానాల్లో కొన్నింటిని బీజేపీ కూడా కోరే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీ కోరుకోగా మిగిలిన స్థానాల్లో తమ అభ్యర్థులను పవన్‌ కళ్యాణ్‌ ప్రకటిస్తారని పేర్కొంటున్నారు.

మార్చి 4న పొత్తుపై బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాతే రెండో విడత సీట్ల ప్రకటన ఉంటుందంటున్నారు. కాగా అసెంబ్లీ సీట్ల కంటే కూడా ఎంపీ సీట్లనే బీజేపీ అధికంగా కోరుతోందని చెబుతున్నారు. బీజేపీ కూడా కూటమిలో చేరాక మేనిఫెస్టోను సంయుక్తంగా ప్రకటించనున్నాయని తెలుస్తోంది.

ఈ రెండో విడత జాబితాలోనే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసే స్థానంపై స్పష్టత రానుంది. ఆయన భీమవరం నుంచే పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారని సమాచారం.

Tags:    

Similar News