బండారు బూతు పంచాంగం... అసలు కారణం ఇదే అయితే మాత్రం..?
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి... మంత్రి ఆర్కే రోజా పై చేసిన దౌర్భాగ్యపు మాటలు రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి... మంత్రి ఆర్కే రోజా పై చేసిన దౌర్భాగ్యపు మాటలు రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆరున్నర పదుల వయసులో ఇంట్లో భార్య పిల్లలను పెట్టుకున్న వ్యక్తి, మాజీ మంత్రి అయిన ఆయన ఇంత దిగజారిపోయి బహిరంగంగా బ్లాక్ మెయిల్ చేస్తూ దుర్భాషలాడటంపై ఏపీ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యింది.
ఇదే సమయంలో ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ రియాక్ట్ కాకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయని తెలుస్తుంది. బండారుకు బుద్ది చెప్పకపోతే.. ఈవ్ టీజర్లకు సమాధానం చెప్పలేరనే విషయాన్ని గుర్తుచేస్తూ కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్పందించారు. బండారు మాటల వెనక కారణాన్ని ఆయన విశ్లేషించే ప్రయత్నం చేశారు.
అవును... మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అదీప్ రాజ్... విమర్శలు చేయండి, పద్దతి ప్రకారం చేయండి.. అంతే కానీ నోరు ఉంది కదా అని వల్గర్ లాంగ్వేజ్ లో ఒక మహిళ గురించి మాట్లాడిన తీరు ఎవరూ హర్షించే విధంగా లేదని అన్నారు. ఇదే సమయంలో ఆయనకు ఏనాడూ మహిళలంటే గౌరవం లేదని అదీప్ రాజ్ విమర్శించారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జెర్రిపోతుల పాలెం గ్రామంలో ఒక మహిళను వివస్త్రను చేసి రోడ్డుపై ఈడ్చారని గుర్తుచేశారు. ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్, మహిళా ఎమ్మార్వో ని జుట్టుపట్టుకుని ఈడ్చిన సందర్భాలను గుర్తు చేసుకుంటే... మహిళలంటే టీడీపీకి ఏమాత్రం గౌరవం లేదనే విషయం అర్ధమవుతుందని ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ తెలిపారు.
ఇదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఎక్కువ మార్కుల అవసరం ఏర్పడిందని... లేకపోతే ఈ సీటు జనసేన ఖాతాలో జమైపోయే అవకాశం ఉందని, అందుకే నోరుంది కదా అని ఎలా బడితే అలా విమర్శలకు దిగుతున్నారని ఆయన అన్నారు. బండారులో ఇలా తన్నుకు వస్తున్న అసహనానికి అసలు కారణం అదే అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే... కారణం ఏదైనా, సందర్భం మరేదైనా, అవసరం ఇంకెలాంటిదైనా... ఒక మహిళపై, మహిళా మంత్రిపై ఇలాంటి మాటలు మాట్లాడటం, క్షమాపణ చెప్పకపోతే తన వద్ద ప్రూఫ్ లు ఉన్నాయని, అవి బయటపెడతానని పబ్లిక్ గా బ్లాక్ మెయిల్ చేయడం ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కాగా... మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీ డీజీపీకి, మహిళా కమిషన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరి ఆయనపై ఏపీ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!