గంటాకు జనసేన షాక్ తగులుతుందా...?
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ అదృష్టవంతుడు అని అంటారు.
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ అదృష్టవంతుడు అని అంటారు. ఆయనది దాదాపుగా పాతికేళ్ల రాజకీయ జీవితం. ఎపుడూ ఓడలేదు. ఆయన పొలిటికల్ లైఫ్ లో టోటల్ గా చూస్తే కొన్ని సందర్భాలు తప్ప ఎక్కువ సార్లు అధికారంలో ఉన్నారు. 1999లో ఎంపీగా నెగ్గిన ఆయన 2004లో చోడవరం నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆ టైం లో టీడీపీ విపక్షంలో ఉంది.
దాంతో గంటా ప్రజారాజ్యంలోకి వెళ్లారు. 2009లో ఆయన ఆ పార్టీ నుంచి గెలిచారు. రెండేళ్ళు తిరగకముందే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన మంత్రి అయిపోయారు. అలా మూడేళ్ళ పాటు ఆ పదవిని నిర్వహించారు. 2014 నాటికి తిరిగి టీడీపీలో చేరిన ఆయన అయిదేళ్ల పాటు చంద్రబాబు క్యాబినేట్ లో మంత్రిగా పనిచేశారు.
ఇక 2019లో టీడీపీ ఓటమి పాలు కావడంతో విపక్షంలోకి వచ్చారు. 2024లో టీడీపీ గెలుస్తుందని నమ్ముతున్న గంటా పొలిటికల్ గా రీ యాక్టివ్ అయ్యారు. ఈసారి టీడీపీ గెలిస్తే మళ్లీ మంత్రి కావాలని ఆయన చూస్తున్నారు. అయితే గంటా ఆశలకు గండి కొట్టేలా జనసేన పొత్తు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. జనసేన పొత్తుతో టీడీపీ వెళ్తే రేపటి రోజున ఏర్పడే సర్కార్ లో కచ్చితంగా ఆ పార్టీకి మంత్రి పదవులు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
జనసేనకు విశాఖ, గోదావరి జిల్లాలలో ఎక్కువ సీట్లు ఇస్తారని అంటున్నారు. ఇక ఆ పార్టీలో ఎక్కువ మంది కాపు సామాజికవర్గం నేతలు ఉన్నారు. వారు ఎమ్మెల్యేలుగా గెలిస్తే మంత్రి పదవులలో ప్రయారిటీ ఇస్తారు. అలా చూసుకుంటే ఒకే ప్రాంతం, ఒకే సామాజికవర్గం ఈ రెండూ గంటా మంత్రి పదవికి మైనస్ గా మారుతాయని అంటున్నారు.
దానికి తోడు ఈసారి చంద్రబాబు మంత్రి పదవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు అని అంటున్నారు పార్టీలో కొంతకాలం పనిచేయకుండా ఉండి చివరలో యాక్టివ్ అయిన వారికి చాలా మందికి టికెట్లే ఇవ్వరని అంటున్నారు. గంటా సీనియర్ అంగబలం అర్ధబలం ఉన్న వారు కాబట్టి టికెట్ దక్కినా మంత్రి పదవి అయితే డౌటే అని ఇప్పటి నుంచే వినిపిస్తోంది.
మరో వైపు చూస్తే విశాఖ జిల్లా టీడీపీలో గంటా మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వర్గాల మధ్య విభేదాలతో పార్టీ నష్టపోతోంది అని అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా ఈ ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చినా పార్టీని పటిష్టం చేయలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. అలాగే ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా చేతులు కలపలేదని ఫిర్యాదులు ఉన్నాయి. దాంతో పార్టీ కోసం కొత్త ముఖాలను జూనియర్లను తీసుకుంటారని మంత్రి పదవులు కూడా వారికే దక్కుతాయని అంటున్నారు. ఎటు నుంచి ఎలా చూసుకున్నా గంటాకు రానున్న రోజులలో రాజకీయం ఎలా ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు.