అగ్రనేతల సరసన లోకేశ్! త్వరలో ప్రమోషన్ ఉంటుందా?

న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ బీజేపీ తమ పోస్టర్లలో ముఖ్య నాయకుల సరసన లోకేశ్ ఫొటోను ముద్రించిన విషయం తెలిసిందే.

Update: 2025-01-08 10:53 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ హెచ్ఆర్డీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతోంది. న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ బీజేపీ తమ పోస్టర్లలో ముఖ్య నాయకుల సరసన లోకేశ్ ఫొటోను ముద్రించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అగ్రనేతలతోపాటు లోకేశ్ ఫొటో వేసి ఫ్లెక్సీలు వేయడం ఆసక్తికరంగా మారింది. అగ్రనేతలు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటుగా లోకేశ్ ఫొటోను ప్రచురించారు. ప్రధాని పర్యటన సందర్భంగా వైజాగ్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో లోకేశ్ ఫొటో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.


ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ముద్రించిన ప్లెక్సీల్లో ప్రధాని మోదీకి ఒక పక్క పవన్ ఉండగా, మరోపక్క చంద్రబాబు, లోకేశ్ ఉన్నారు. ఇన్నాళ్లు కూటమి ఫొటోల్లో చంద్రబాబు, పవన్, పురందేశ్వరి మాత్రమే ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో బీజేపీ ముద్రించే ఫ్లెక్సీల్లో చంద్రబాబు, పవన్ తో సమానంగా లోకేశ్ కు ప్రాధాన్యమిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పరంగానూ కీలక నిర్ణయాల్లో భాగస్వామి అవుతున్న లోకేశ్ పనితీరు ప్రశంసలు అందుకుంటోంది.


గత ఐదేళ్లలో టీడీపీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చంద్రబాబు అరెస్టుతోపాటు కొన్ని ఇతర సందర్బాల్లో లోకేశ్ నాయకత్వం పార్టీని ఏకతాటిపై నిలిపింది. అంతేకాకుండా యువగళం పాదయాత్ర పేరుతో సుమారు 3000 కిలో మీటర్లు పర్యటించిన లోకేశ్ పార్టీపై తన ముద్ర వేశారు. భావి నేతగా కార్యకర్తల ఆమోదం పొందారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై పదునైన విమర్శలతో గతంలో తనపై ఉన్న ముద్రను చెరిపేసుకున్నారు. ఇక మంత్రిగా ఉంటూ ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇలా అన్నివర్గాల నుంచి లోకేశ్ నాయకత్వంపై నమ్మకం ఏర్పడుతుండటంతో బీజేపీ కూడా ఆయనకు ప్రాధాన్యమిస్తోంది. దీనికి సంకేతంగానే న్యూఇయర్ సందర్భంగా తెలంగాణలో వేసిన పోస్టర్లు, ఇప్పుడు ప్రధాని విశాఖ పర్యటన పోస్టర్లను ఉదహరిస్తున్నారు.

Tags:    

Similar News