'గేమ్ ఛేంజర్'పై రేవంత్ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ
అందుకు భిన్నంగా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న పెద్ద సినిమాల జాబితాలో మొదటిగా ఉన్న గేమ్ ఛేంజర్ మూవీకి అనుమతులు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
'పుష్ప 2' బెనిఫిట్ షో సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో కీలక ప్రకటన చేయటం.. బెనిఫిట్ షోలు.. టికెట్ల ధరల పెంపునకు తమ ప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న పెద్ద సినిమాల జాబితాలో మొదటిగా ఉన్న గేమ్ ఛేంజర్ మూవీకి అనుమతులు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
అదనపు షోలకు ఓకే చెప్పటంపై అభ్యంతరం లేకున్నా.. తెల్లవారుజామున నాలుగు గంటల వేళలో ప్రదర్శించే షోకు ఓకే చెప్పటం.. టికెట్ ధరల పెంపునకు సానుకూలంగా స్పందించటంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన చేసిన కొద్ది రోజులకే.. అందుకు భిన్నమైన ప్రకటన వెలువడటం చర్చకు తెర తీసింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ హైకోర్టును ఆశ్రయించారో పిటిషనర్. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ వాదనల వేళ.. గేమ్ ఛేంజర్ మూవీకి ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో పునస్సమీక్షించాలని ఆదేశించింది. గురువారం ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేశారు. బెనిఫిట్ షోలకు నో చెబుతామని చెప్పిన ప్రభుత్వం.. అదనపు షో ద్వారా అనుమతులు ఇచ్చినట్లుగా పిటిషనర్ పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. తెల్లవారుజామున అదనపు ప్రదర్శనలకు ప్రభుత్వం ఒప్పుకుందంటే వాటిని బెనిఫిట్ షోలుగానే పరిగణించాలని పేర్కొన్నారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. రాత్రి నిద్రపోయే వేళలో సినిమాలేంటి? అర్థరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత మీ పిల్లల్నిరోడ్లపై తిరగనిస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఇదే తీరును కొనసాగిస్తే.. పదహారేళ్లు నిండని వారికి అర్థరాత్రి సినిమాలకు.. పబ్ లకు అనుమతించకూడదని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొనటం గమనార్హం. నిబంధనల్ని ఉల్లంఘిస్తే రాత్రి పదకొండు దాటిన తర్వత సినిమా థియేటర్లు.. పబ్ ల మూసివేతకు ఆదేశాలు ఇస్తామంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
సంధ్య థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోలు ఉండవంటూ ప్రభుత్వం విధాన నిర్ణయాన్ని ప్రకటించిందని.. తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నుంచి ఏకంగా ఆరు షోలకు అనుమతి ఇచ్చిన అంశాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా.. న్యాయమూర్తి జోక్యం చేసుకొని.. సినిమా ఇప్పటికే రిలీజ్ అయిన నేపథ్యంలో అదనపు షోలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. దీనికి లాయర్ స్పందిస్తూ.. టికెట్ల ధరల్ని ఈ నెల 11 నుంచి 19 వరకు అమల్లో ఉంటాయన్నారు.
దీనికి ప్రభుత్వ న్యాయవాది తన వాదనల్ని వినిపిస్తూ మల్టీఫ్లెక్సులు.. సింగిల్ థియేటర్ లలో ఐదు షోలకు అనుమతించవచ్చన్నారు. గేమ్ ఛేంజర్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించినందుకు నిర్మాత వినతితో టికెట్ల పెంపును అనుమతించినట్లుగా తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి టికెట్ల ధరలను పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో రీరివ్యూ చేయాలన్నారు. తదుపరి విచారణను ఈ నెల 28కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని పేర్కొన్న వైనం అటు ప్రభుత్వానికి.. ఇటు సినిమా రంగానికి ఇబ్బందికర వాతావరణం ఎదురయ్యేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.