వదిలేదే లే.. రంగనాథ్ ‘హైడ్రా’ ప్లానింగ్ మామూలుగా లేదుగా..

హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ముందుకు నుంచి దూకుడుగానే వ్యవహరిస్తోంది.

Update: 2024-09-24 05:48 GMT

హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ముందుకు నుంచి దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఎక్కడా తగ్గకుండా.. ఎవరికీ లొంగకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. కేవలం ప్రభుత్వం నుంచి వస్తున్న సూచనలు, ఆదేశాలను పాటిస్తూ పనిని పూర్తిచేస్తోంది.

హైడ్రా ఏర్పాటు నుంచి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వతంత్ర హోదా కల్పించారు. ఎలాంటి నిర్ణయాధికారం అయినా తీసుకునే హక్కు కల్పించారు. అంతేగాకుండా ఇటీవల దానికి చట్టబద్ధత కూడా తీసుకొచ్చారు. పలు అదనపు అధికారాలను కట్టబెడుతూ కేబినెట్ మీటింగులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో హైడ్రాకు మరిన్ని అధికారులు చేకూరాయి. అలాగే.. మరింత మంది స్టాఫ్‌ను సైతం హైడ్రాకు కేటాయించారు. పోలీసులతోపాటు మరికొంత మందిని ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని కేటాయించారు. దాంతో ఒకప్పుడు ఇద్దరు ముగ్గురితో ఉన్న హైడ్రా వ్యవస్థ.. ఇప్పుడు సంఖ్యాబలం పెంచుకుంది. ఇక... హైడ్రా పరిధిని కూడా కేవలం సిటీ వరకే పరిమితం చేయకుండా దాని పరిమితిని కూడా పెంచారు.

తాజాగా.. హైడ్రా దృష్టికి మరో కీలక అంశం చేరింది. కొందరు అధికారులు కొన్నిచోట్ల హద్దులు మార్చి.. తప్పుడు పత్రాలు సృష్టించినట్లుగా విచారణలో వెలుగులోకి వచ్చింది. వాటిని చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. అవసరమైతే కేంద్ర సంస్థ నుంచి సహాయం తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్‌ఆర్ఎస్‌సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) నుంచి 45 ఏళ్ల నాటి శాటిలైట్ చిత్రాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. అక్రమార్కులు ఒక విధంగా ఆలోచన చేస్తే.. దానికి వంద రెట్లు హైడ్రా ఆలోచన చేస్తున్నట్లుగానే చెప్పాలి. అందుకే.. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా ఎక్కడా వెనకడుగు వేయడం లేదని స్పష్టం అవుతోంది. అందులో భాగంగా ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎన్‌ఆర్ఎస్సీ కేంద్రాన్ని సందర్శించారు కూడా. అక్కడి శాస్త్రవేత్తలతో హైడ్రా పనితీరుపై చర్చించారు. చెరువుల రక్షణకు మీ వంతు సహాయం కావాలని కోరారు.

ఇప్పటికే వందలాది నిర్మాణాలు హైడ్రా చేతిలో నేలమట్టం అయ్యాయి. చాలా వరకు భూములను రికవరీ చేశారు. ఇంకా చాలా వరకు రికవరీ చేసే పని ఉండడంతో.. అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు మరింత లోతుగా పరిశీలిస్తోంది. ఇప్పటివరకు కూడా సరైన ఆధారలతోనే హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వచ్చింది. ఇకముందు కూడా అలానే చేయనుంది. ఇప్పుడు అక్రమార్కులకు లొంగి గ్యాప్ ఇస్తే అనుకున్న లక్ష్యం సాధ్యపడదని, నగరంలో చాలా వరకు చెరువులు, నాలాలు కబ్జాలకు గురయ్యాయని కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు వెనక్కి తగ్గి తమ నిర్ణయాలను అమలు చేయకుంటే భవిష్యత్తులోనూ ఈ ఆక్రమణలు ఇంకా పెరుగుతాయని అంటున్నారు. అందుకే.. శాటిలైట్ ద్వారా రూపొందించిన పటాలను సైతం కొనుగోలు చేసేందుుక రెడీ అయినట్లు వివరించారు. కాగా.. హైడ్రా అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎన్‌ఆర్ఎస్‌సీ సంస్థ కూడా 56 చెరువులకు సంబంధించిన మ్యాప్‌లను అందజేసింది. 1979-2023 వరకు చెరువులు ఎలా ఆక్రమణకు గురయ్యాయో ఈ మ్యాప్‌లలో వివరించారు.

Tags:    

Similar News