కేసులు, ఆరోపణలు, ఫిర్యాదులు..చలికాలంలో హీటెక్కిన తెలంగాణ రాజకీయం
బీఆర్ఎస్ పదేళ్ల పాలన లోపాలను వెదుకుతున్న కాంగ్రెస్ సర్కారుకు మరో అంశంగా దొరికింది లగిచర్ల ఫార్మా పరిశ్రమల అంశం.
ఏపీతో పోలిస్తే తెలంగాణ రాజకీయం గరంగరంగా ఉంది. చల్లటి చలి కాలంలో మంటలు పుట్టిస్తోంది.. కేసులు, ఆరోపణలు, ఫిర్యాదులతో సెగ రగులుతోంది.. అవినీతి, అక్రమాలు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో రక్తికడుతోంది. మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వైరం ఎక్కడకో వెళ్తోంది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య విమర్శలు సహజమే. అయితే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి అరెస్టుల వరకు వచ్చింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలన లోపాలను వెదుకుతున్న కాంగ్రెస్ సర్కారుకు మరో అంశంగా దొరికింది లగిచర్ల ఫార్మా పరిశ్రమల అంశం. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సైతం సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తోంది.
ఢిల్లీలో రేవంత్, కేటీఆర్
యాక్సిడెంటల్ గానే అయినా.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే సమయంలో ఢిల్లీ వెళ్లారు. అమృత్ 2.0 టెండర్లలో అవినీతి జరిగిందంటూ కేటీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఫార్ములా ఈ–రేస్ విషయంలో కేటీఆర్ పై చర్యలు ఉంటాయని రేవంత్ వ్యాఖ్యానించారు. వీరిద్దరూ అక్కడ ఉండగానే.. వికారాబాద్ జిల్లా లగిచర్లలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులపై దాడి జరిగింది. దీంతో రాజకీయ రగడ మరింత ముదిరింది.
మళ్లీ ట్యాపింగ్ తీగ..
గత 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేసిన అంశం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న ఫోన్ ట్యాపింగ్. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. మొన్నటివరకు ట్యాపింగ్ పోలీసు అధికారుల చుట్టూనే తిరిగింది. ఇప్పుడు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేల వైపు మళ్లింది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ అవగా, మరో నలుగురికీ ఇచ్చారని తెలుస్తోంది.
సీఎం సొంత నియోజవకర్గంలో..
ముఖ్యమంత్రి రేవంత్ తరచూ కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతుండగా.. ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఫార్మా సంస్థల ఏర్పాటుకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, ‘కడా’ ప్రత్యేకాధికారిపై తీవ్ర సంచలనం రేపింది. దీంట్లో కేటీఆర్ ప్రమేయం ఉందనేలా ఎఫ్ఐఆర్ దాఖలైంది. ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి జరిగిందని మంత్రులు సైతం ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు కూడా చేశారు.
హైడ్రా వెనక్కుపోయింది..
అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ లో మొన్నటివరకు తీవ్ర సంచలనం రేపిన హైడ్రా గొడవ ఇప్పుడు వెనక్కుపోయింది. మూసీ పునరుజ్జీవం రెండో ప్రాధాన్యంగా మారింది. ఫోకస్ అంతా అమృత్ టెండర్లు, ఈ రేస్, ఫార్మా పరిశ్రమల వైపు మళ్లింది. మరీ ముఖ్యంగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీనీ రంగంలోకి దించినట్లయింది. తద్వారా మూడో పార్టీకీ చోటిచ్చినట్లయింది. ఒకవేళ కేంద్రం స్పందించి విచారణకు ఆదేశిస్తే ఏం జరుగుతోందో ఆసక్తికరం.
దీపావళి వెళ్లాక బాంబుల మోత
దీపావళికి పొలిటికల్ బాంబులు పేలతాయంటూ తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి గతంలో వ్యాఖ్యానించారు. దీపావళి వెళ్లిపోయాక బాంబులు పేలుతున్నాయి. ఫార్ములా–ఈ కార్ల రేసు వ్యవహారంలో విదేశీ కంపెనీకి రూ.55 కోట్లు అనుమతులు లేకుండా చెల్లించారన్న దానిపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించడం, కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతిస్తే ఏం జరుగుతుందో చూడాలి.