15 రోజులు 4500 ఫోన్లు.. 340జీబీ సమాచారం.. ట్యాపింగ్ రేంజ్ ఇంతనా?

ఇటీవల కాలంలో ట్యాపింగ్ కేసు అప్డేట్ ఏమీ లేని వేళ.. తాము చెప్పిందే నిజమన్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Update: 2024-09-23 04:01 GMT

అప్పట్లో పెను సంచలనంగా మారి.. షాకింగ్ పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట బలంగా వినిపించిన ఫోన్ ట్యాపింగ్ ఉందంతం ఆ తర్వాత పెద్దగా పరిణామాలు చోటు చేసుకోకపోవటం తెలిసిందే. అయితే.. ఫోన్ ట్యాపింగ్ అంశంపై రేవంత్ సర్కారు పద్దతి ప్రకారం పోతుందన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తున్నా.. ‘‘అదేమీ లేదు.. ఏం జరగదు చూడండి’ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న పరిసర్థితి.ఇటీవల కాలంలో ట్యాపింగ్ కేసు అప్డేట్ ఏమీ లేని వేళ.. తాము చెప్పిందే నిజమన్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే.. అలాంటిదేమీ లేదని.. ట్యాపింగ్ కేసు విచారణ.. తదితర అంశాలన్ని చట్టపరంగా చేయాలన్న ఆదేశాల్ని ప్రభుత్వం నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. అదే సమయంలో తాము ఈ అంశంపై జోక్యం చేసుకోమన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా పెను సంచలనంగా మారే అవకాశం ఉండటంతో.. రాజకీయ జోక్యంతో కేసు తీవ్రత తగ్గుతుందని.. అందుకే తాము ఇందులో జోక్యం చేసుకోమన్న సంకేతాలు ప్రభుత్వం నుంచి వచ్చినట్లుగా చెబుతారు.

తాజాగా ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న తిరపతన్న బెయిల్ పిటిషన్ పై శనివారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంచలన అంశాల్ని ప్రస్తావించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలో ఏకంగా 4500లకు పైగా ఫోన్లు ట్యాప్ చేసిన వైనాన్ని వెల్లడించారు. ఈ ట్యాపింగ్ మొత్తం ఎన్నికల సమయమైన నవంబరు 15-30ల మధ్యలోనే జరిగినట్లుగా వెల్లడించారు.

ఈ ఫోన్లు బీఎస్ఎన్ఎల్.. వొడా ఫోన్.. జియో నెట్ వర్కులకు సంబంధించినవని.. కొన్ని వందల ఎయిర్ టెల్ ఫోన్ల ట్యాపింగ్ డేటాను నిందితులు పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా కోర్టు ద్రష్టికి వచ్చింది. ముఖ్యనేతలు రేవంత్ తో సహా పలువురు వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సుమారు 340 జీబీ మేర సమాచారాన్ని దర్యాప్తు లో భాగంగా పోలీసులు వెలికితీసినట్లుగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు ఇప్పటికే అభియోగ పత్రం నమోదు చేయటం.. కొద్ది రోజుల్లో దీనికి అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేయనున్నారు.

అదే టైంలో ఈ కేసులో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పోలీసు అధికారులు ప్రభాకర్ రావు.. శ్రవణ్ రావులను విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. నిందితులు ఇద్దరిని బలవంతంగా స్వదేశానికి తిప్పి పంపటం లాంటి చర్యలకు చేపట్టనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వారిని విచారించిన తర్వాతే ఈ కేసుకు సంబంధించిన అనుబంధ అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. ఈ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో పెను సంచలనాలు చోటు చేసుకోనున్నట్లు చెప్పాలి.

Tags:    

Similar News