తెలంగాణాలో టీడీపీ విస్తరణ సాధ్యమేనా ?

తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో పార్టీని మళ్లీ విస్తరించి పటిష్టం చేయాలని చూస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణా మీద ఎపుడూ ఆ కోరిక ఉంటూనే ఉంది.

Update: 2024-12-31 03:50 GMT

తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో పార్టీని మళ్లీ విస్తరించి పటిష్టం చేయాలని చూస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణా మీద ఎపుడూ ఆ కోరిక ఉంటూనే ఉంది. ఎందుకు అంటే ఆయన ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళ పాటు సీఎం గా పనిచేశారు. తెలంగాణాను ఎంతగానో అభివృద్ధి చేశారు. ప్రత్యేకించి సైబరాబాద్ సృష్టికర్తగా కూడా ఉన్నారు.

అందువల్ల చంద్రబాబుకు తెలంగాణా ప్రజల మీద అక్కడ పార్టీ విస్తరణ మీద ఆశలు చాలా ఉన్నాయి. అందుకే ఆయన ఇటీవల పనిగట్టుకుని మరీ ప్రశాంత్ కిశోర్ టీం తో సర్వే చేయించారు అని అంటున్నారు. పార్టీ అక్కడ విస్తరించేందుకు గల అవకాశాలు ఏ మాత్రం ఉన్నాయని ఆయన ఆలోచిస్తున్నారు అంటున్నారు.

అయితే ఈ సర్వేలో కీలక విషయాలు బయటకు వచ్చాయని చెబుతున్నారు. అవేంటి అంటే తెలంగాణాలో ఈ రోజుకీ టీడీపీకి అభిమానులు ఉన్నారు. బాబు మంచి ముఖ్యమంత్రి అని మెచ్చుకునే జనాలు కూడా ఉన్నారని అంటున్నారు. అలాగే టీడీపీకి కొన్ని చోట్ల క్యాడర్ అయితే ఉంది. కానీ ఎక్కడ చూసినా నడిపించే నాయకత్వం అయితే లేదు అని అంటున్నారు.

నియోజకవర్గాల స్థాయిలో బలమైన నేతలు అయితే మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలో లేరు అని అంటున్నారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలని టీడీపీ భావిస్తోంది అంటున్నారు. 2025లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధులను పెట్టడం ద్వారా టీడీపీకి పట్టు ఉన్న ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజమాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకుంటే క్షేత్ర స్థాయిలో పటిష్టమైన నాయకత్వం ఏర్పాటు అవుతుందని ఆ మీదట 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలపడుతుందని టీడీపీ అధినాయకత్వం విశ్వసిస్తోంది.

అయితే తెలంగాణాలో టీడీపీ పట్ల జనంలో అభిమానం ఉన్నప్పటికి అవి ఓట్లు కింద కన్వర్ట్ కావడం అంటే అంత సులువుగా జరిగే పని కాదని అంటున్నారు. తెలంగాణా ఏర్పాటు అయింతే స్థానికంగా పాలించుకోవాలన్న నినాదంతో అని గుర్తు చేస్తున్నారు. టీడీపీకి అధినాయక్త్వం ఆంధ్రా నుంచి ఉంది. అందువల్ల ఆ పార్టీ ఎదుగుదలకు అదే మూలమైన అవరోధంగా మారుతుంది అని అంటున్నారు.

అయితే టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. పైగా బ్రహ్మాండమైన పార్టీ ఆఫీసు ఈ రోజుకీ హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. దాంతో పాటు వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్టీఆర్ సమాధి కూడా హైదరాబాద్ లోనే ఉంది. వీటిని అన్నింటికీ దృష్టిలో ఉంచుకుని టీడీపీ రాజకీయంగా ఎంతో కొంత అక్కడ ఉనికి కోసం ప్రయత్నం చేయాల్సిందే అని అంటున్నారు.

కానీ తెలంగాణాలో అధికారం అయితే స్థానికంగా ఉన్న తెలంగాణా వాదులకు తప్ప ఏపీ మూలాలు ఉన్న నాయకత్వ పార్టీలకు ఎప్పటికీ దక్కదు అన్నది ఒక కఠినమైన విశ్లేషణ అని అంటున్నారు. అయితే పొత్తు రాజకీయాలలో సంకీర్ణ యుగంలో ఎంతో కొంత టీడీపీకి మేలు జరగకపోతుందా అన్నదే టీడీపీ పెద్దల ఆలోచనగా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి టీడీపీది ఆశనా లేక అత్యాశనా లేక వృధా ప్రయాసనా అన్నది రానున్న కాలమే తేల్చి చెప్పనుంది.

Tags:    

Similar News