బ్రిజ్ భూషణ్ మీద ఫైర్ అయ్యే కేటీఆర్ ఇప్పుడేం చెబుతారు?

గెలుపు మీద తనకెంత ధీమా ఉందన్న విషయాన్ని టికెట్లు ఫైనల్ చేయటం ద్వారా తేల్చేశారని చెప్పాలి

Update: 2023-08-23 05:58 GMT

పార్టీ అంతర్గత సమావేశాల్లో వాడి వేడీ వార్నింగులు.. పని చేయకున్నా.. తీవ్రమైన ఆరోపణలు ఉన్నా.. సర్వే రిపోర్టులు తేడాగా వచ్చినా పార్టీ టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదంటూ పలుమార్లు చెప్పిన గులాబీ బాస్ మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం ఉండదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఒక అంచనా ప్రకారం సిట్టింగుల్లో కనీసం 30 మంది.. గరిష్ఠంగా నలభై మంది వరకు కొత్త అభ్యర్థులు తెర మీదకు వస్తారన్న ప్రచారం సాగింది. అందుకు భిన్నంగా కేవలం ఎనిమిది మందిని మాత్రమే మార్చి ఏకంగా 115 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించటం ద్వారా.. కొత్త రికార్డును నెలకొల్పారు కేసీఆర్.

గెలుపు మీద తనకెంత ధీమా ఉందన్న విషయాన్ని టికెట్లు ఫైనల్ చేయటం ద్వారా తేల్చేశారని చెప్పాలి. అయితే.. తాజాగా ఖరారు చేసినట్లుగా చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పలువురు అభ్యర్థులకు టికెట్లను నిరాకరించకుండా ఇవ్వటాన్ని ప్రశ్నిస్తున్నారు. అందులో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గంచిన్నయ్యపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై బోడపాటి శేజల్ అనే మహిళ సంచలన ఆరోపణలు చేయటమే కాదు.. ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన చేపట్టారు. ఒకదశలో విసిగిపోయి ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నారు.

తాజాగా చిన్నం దుర్గయ్యకు టికెట్ కేటాయింపుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. దుర్గయ్యకు టికెట్ నిరాకరిస్తారన్న ప్రచారంసాగింది. అందుకు భిన్నంగా ఆయనకు టికెట్ ఓకే చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఒక కామపిశాచికి.. చీటర్ కు మరోసారి టికెట్ కన్ఫర్మ్ చేయటం ద్వారా.. ఆయన చేసే తప్పుడు పనులకు లైసెన్సు ఇచ్చేసినట్లు అవుతుందన్న ఘాటు వ్యాఖ్య చేస్తున్నారు శేజల్.

తాను ఏడు నెలలుగా చిన్నయ్య  దుర్మార్గాల మీద పోరాటంచేస్తున్నానని.. తాను ఎక్కని పోలీస్ స్టేషన్ లేదని.. కలవని ప్రభుత్వ పెద్దలు లేరన్న ఆమె.. అయినప్పటికీ ముఖ్యమంత్రి టికెట్ కేటాయించటాన్ని తప్పు పడుతున్నారు. ఓవైపు తరచూ సంచలన వార్తల్లో ప్రముఖంగా నిలిచే రాజయ్యకు టికెట్ నో చెప్పిన కేసీఆర్.. బ్రిజ్ భూషణ్ తరహాలో ఒక మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసినా.. టికెట్ ఇవ్వటంపై విస్మయం వ్యక్తమవుతోంది. అథ్లెట్లను వేధింపులకు గురి చేసిన బ్రిజ్ భూషన్ పై మంత్రి కేటీఆర్ తో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు తప్పు పట్టినప్పుడు.. దుర్గయ్య విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం పార్టీకి నష్టం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News