అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అందుకే.. క్రాక్ చేసిన కేసీఆర్?

ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో తిరుగులేని అధిక్యత ఉన్నట్లుగా కనిపించిన ఆ పార్టీ ఇప్పుడు బేలతనాన్ని ప్రదర్శిస్తోంది

Update: 2024-03-04 05:59 GMT

గెలుపు పక్కా అనుకున్న వేళ.. అందుకు భిన్నంగా ఓటమి ఎదురైతే ఎంత షాక్ ఉంటుందో.. అంతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్. అధికారంలో ఉన్నప్పడు అన్ని సానుకూలతలు వెన్నంటే ఉన్నట్లు కనిపించినా.. ఒక్కసారి ఓటమి ఎదురైన తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్న దానికి నిదర్శనంగా గులాబీ పార్టీ నిలుస్తోంది. ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో తిరుగులేని అధిక్యత ఉన్నట్లుగా కనిపించిన ఆ పార్టీ ఇప్పుడు బేలతనాన్ని ప్రదర్శిస్తోంది.

తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో రివ్యూ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్.. పెద్దపల్లి నేతలకు దిశానిర్దేశం చేసిన ఆయన.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఇన్ని రోజుల తర్వాత కూడా పార్టీ ఓటమిపై ఆయన వ్యాఖ్యల్ని విన్న తర్వాత అర్థమయ్యేది ఒక్కటే. గ్రౌండ్ లో ఉన్న సమాచారాన్ని అందిపుచ్చుకోవటంలో ఆయన ఇప్పటికి దూరంగా ఉన్నారనే భావన కలుగుతుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలంతా ఎమ్మెల్యే ఓడిపోవాలని.. కేసీఆర్ మాత్రం గెలవాలని అనుకున్నారని.. అందుకే మనకు మొదటికే మోసం వచ్చింది’ అని వ్యాఖ్యానించటం గమనార్హం. ఒకవేళ కేసీఆర్ మాటే నిజమని అనుకుందాం. మరి.. ఆయన్ను అంతగా గెలిపించాలని ప్రజల్లో ఉండి ఉంటే.. కామారెడ్డిలో ఆయన స్వయంగా పోటీ చేసిన చోట ఓడిపోవటం దేనికి నిదర్శనం? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.

పార్టీకి గెలుపు.. ఓటములు కొత్త కాదని.. కుంగిపోయేది.. పొంగి పోయేది ఏమీ లేదన్న ఆయన ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదన్నారు. అయితే.. ఓడిన ఎమ్మెల్యేల మీదనే కాదు.. ఓడిన తనపైనా ప్రజల్లో ఇంకా సానుకూలత రాలేదన్న నిజాన్ని కూడా కేసీఆర్ గుర్తిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కచ్ఛితంగా గెలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. రైతులు రోడ్లకు ఎక్కుతారన్న ఆయన.. బీఆర్ఎస్ తో మేలు జరుగుతుందన్న భావన ప్రజల్లో మొదలైందన్న వ్యాఖ్య చేయటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని పట్టించుకోవద్దన్న ఆయన.. ఎంపీ ఎన్నికల్లో అందరూ కలిసి పని చేయాలన్నారు. త్వరలో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో సభను నిర్వహిద్దామన్న కేసీఆర్.. అనంతరం బస్సు యాత్రను చేపడతామని వ్యాఖ్యానించారు.

రానున్న ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్.. బీజేపీ మధ్యనే ఉంటుందని చెప్పిన కేసీఆర్.. గతంలో ఎల్ఆర్ఎస్ ను ప్రకటిస్తే ప్రజల రక్తం పీలుస్తారంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద రాద్ధాంతం చేశారని.. ఇప్పుడదే ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో తమకు పోటీనే లేదన్నట్లుగా ఉన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి.. ఈ వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ తీరులో రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News