కేసీఆర్ కు ఆయుధంగా మారనున్న కేంద్ర తాజా రిపోర్టు!

Update: 2023-08-13 15:30 GMT

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో డెవలప్ మెంట్ దూసుకెళ్లిపోతుందంటూ గులాబీ బాస్ కమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ పదే పదే ప్రస్తావించటం తెలిసిందే. తమ వాదనకు బలం చేకూరేలా పలు లెక్కలు.. గణాంకాలు వారి నోటి నుంచి వస్తుంటాయి. తాజాగా వారి మాటలు నిజాలే అన్న విషయాన్ని ఖరారు చేసేలా కేంద్రం విడుదల చేసిన ఒక రిపోర్టు చెబుతోంది. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేస్తున్న వేళ.. తాజాగా కేంద్రం విడుదల చేసిన రిపోర్టు ఒక టానిక్ మాదిరి మారుతుందని మాత్రం చెప్పక తప్పదు.

దేశానికి తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్ పవర్ హౌస్ గా మారిందన్న విషయాన్ని తాజాగా విడుదలైన ఆర్థికశాఖ రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఈ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఎన్ ఎస్ డీపీ తలసరి ఆధాయం రూ.3,08,732 ఉన్నట్లుగా పేర్కొంది. ఇది కర్ణాటక కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలోని సంపన్న రాష్ట్రాలైన కర్ణాటక.. హర్యానాల కంటే తెలంగాణ ముందు ఉండటం ద్వారా.. దేశంలో నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో తెలంగాణ ముందున్న విషయం స్పష్టమైంది.

తెలంగాణ తర్వాతి స్థానంలో కర్ణాటక నిలిచింది. కేంద్రం లెక్కల ప్రకారం కర్ణాటకలో రూ.3,01,673 ఉంటే హర్యానాలో రూ.2,96,685 ఉంది. గడిచిన ఆరేళ్లలో తెలంగాణలో ఎన్ సీడీపీ తలసరి ఆదాయం 72 శాతం పెరిగింది. 2017-18లో రూ.1,79,358 ఉంటే 2022623 నాటికి రూ.3.12 లక్షలకు పెరగటం గమనార్హం. రాష్ట్రం ఏర్పడిన 2014-15 నాటికి ఉన్న 1.72 లక్షలతో పోలిస్తే.. తాజాగా పెరిగిన దానితో పోలిస్తే తలసరి ఆదాయం 151 శాతం పెరిగినట్లుగా చెప్పాలి.

ఈ నివేదిక ప్రకారం చూస్తే.. తెలంగాణ ప్రజలు దేశంలోనే అత్యధిక ఆదాయం పొందటమే కాదు.. దేశానికి కూడా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నట్లుగా చెప్పాలి. ఈ నేపథ్యంలో గుజరాత్.. కేరళ.. కర్ణాటక.. మహారాష్ట్ర.. తమిళనాడు రాష్ట్రాలు వెనక్కి వెళ్లి.. తెలంగాణ ముందు నిలిచింది. ఈ పాజిటివ్ రిపోర్టు కీలకమైన ఎన్నికల వేళ కేసీఆర్ కు వరంగా మారిందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News