గులాబీ కోటలో కలకలాన్ని రేపిన రాహుల్ ఆ ఒక్క మాట

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీ అధినేతలు.. ముఖ్యనేతలు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు

Update: 2023-10-20 13:30 GMT

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీ అధినేతలు.. ముఖ్యనేతలు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. గడిచిన రెండు రోజులుగా సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయటం కనిపిస్తోంది. కేసీఆర్ సర్కారు అవినీతి గురించి పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చినంతనే ఇప్పటివరకు తిన్నదంతా బయటకు కక్కిస్తామని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందన్న రాహుల్.. తాను తెలంగాణలో తిరుగుతున్న సందర్భంగా ఆ విషయాన్ని గుర్తించినట్లుగా పేర్కొన్నారు. కేసీఆర్ తిన్నది.. జేబుల్లో నింపుకొన్నదంతా బయటకు రప్పిస్తానని చెప్పిన ఆయన.. తమ కార్యకర్తలు పులలని.. పదేళ్ల కాలంలో వారిపై కేసులు పెట్టి.. లాఠీలతో కొట్టి నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారన్నారు.

కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని.. వెనకడుగు వేయొద్దని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు..కార్యకర్తలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీద ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. అదానీ వ్యవహారంలో తాను మోడీ సర్కారుతో పోరాడుతున్నందుకు తనపై 24 కేసులు పెట్టారని.. తన పార్లమెంటు సభ్యత్వాన్ని సైతం రద్దు చేశారన్నారు. మిగిలిన విపక్షాలను ఈడీ.. ఐటీ కేసులంటూకేంద్రం భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. కానీ ఆయనపై ఈడీ..సీబీఐ కేసులు మాత్రం ఎందుకు లేవని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతిపై ఎలాంటి విచారణ జరగలేదంటూ మండిపడ్డారు.

ఓవైపు బీజేపీ తమకు ప్రత్యర్థిగా కేసీఆర్ అండ్ కో చెబుతున్న వేళ.. ఒకవేళ అదే నిజమైతే మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి మోడీ సర్కారు కేసీఆర్ సంగతి ఎందుకు చూడలేదన్నట్లుగా ప్రశ్నించిన రాహుల్ గాంధీ మాటలుఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. గులాబీ కోటలో కలకలాన్ని రేపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News