వీహెచ్, జానా, జగ్గారెడ్డి 'సీఎం' వ్యాఖ్యలు.. అంటున్నారా? ఎవరైనా అనిపిస్తున్నారా?

నాకు సీఎం పదవిపై ఆశలేదు.. నేను సీఎం కావాలనేది ప్రజల కోరిక.. వచ్చే పదేళ్లలో నేను సీఎం అవుతా.. ఇవీ తెలంగాణ కాంగ్రెస్ నేతల వెంట వస్తున్న వ్యాఖ్యలు

Update: 2023-10-25 03:46 GMT

నాకు సీఎం పదవిపై ఆశలేదు.. నేను సీఎం కావాలనేది ప్రజల కోరిక.. వచ్చే పదేళ్లలో నేను సీఎం అవుతా.. ఇవీ తెలంగాణ కాంగ్రెస్ నేతల వెంట వస్తున్న వ్యాఖ్యలు. ఎన్నికల ముంగిట ముగ్గురు కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా నెలపైగా సమయం ఉంది. ఇప్పటివరకు పార్టీ పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేదు. పొత్తుల విషయం కూడా తేలలేదు. మరోవైపు మేనిఫెస్టోపై కసరత్తు సాగుతోంది. నోటిఫికేషన్ విడుదలై.. ప్రచారం ఊపందుకోవాల్సి ఉంది. నామినేషన్లు దాఖలు కావాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ''నేను- సీఎం'' అనే వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల నోటి వెంట వస్తుండడం గమనార్హం.

పెద్ద వయసు నేతలూ.. ఇది తగునా?

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని చెబుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనను చూశాం.. మరొకరికి అవకాశం ఇద్దాం అని కొందరు, కేసీఆర్ కొంత విఫలం అయ్యారని మరికొందరు.. మరీ నియంత తరహా పాలన.. ఇలా పలు వర్గాల వారు బీఆర్ఎస్ కు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం తెలంగాణకు బూస్ట్ లా మారింది. టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరుల ఆధ్వర్యంలో కదనోత్సాహంతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. అయితే, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటి నుంచి ''సీఎం''అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. వాస్తవానికి వీహెచ్,జానారెడ్డిలకు 70 ఏళ్లు పైబడ్డాయి. 75 ఏళ్ల వీహెచ్ గతంలో రాజ్య సభ సభ్యుడిగా పనిచేశారు. అది కూడా మూడుసార్లు ఎంపీగా ఉన్నారు. ఆయన 1978, 1989లో అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గనేలేదు. కానీ, కొన్ని రోజుల కిందట.. ''నాకు సీఎం పదవిపై ఆశలేదు. సీఎం కావాలని కోరుకోవడం లేదు'' అంటూ వ్యాఖ్యానించారు.

ఇక జానారెడ్డిది మరో చరిత్ర. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీలోకి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2018లో నాగార్జున సాగర్ లో ఓటమి.. ఉప ఎన్నికలోనూ పరాజయంతో 77 ఏళ్ల జానారెడ్డి రాజకీయ జీవితం చరమాంకానికి చేరింది. దీంతోనే ఈ ఎన్నికల్లో కుమారుడు జైవీర్ ను బరిలో దింపుతున్నారు. అయితే, ఆయన సైతం ఇటీవల ''నేను సీఎం కావాలనేది ప్రజల కోరిక. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది'' అని ప్రకటించారు. తద్వారా తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ ఉందని పేర్కొన్నారు.

తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం ''వచ్చే పదేళ్లలో నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతా'' అని ప్రకటించారు. వాస్తవానికి జగ్గారెడ్డి ప్రజా బలం ఉన్న నాయకుడే. బీజేపీ, బీఆర్ఎస్ నేపథ్యం నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినా.. సొంత ముద్రతో నిలిచారు. మరోవైపు జగ్గారెడ్డి ఏడాది రెండేళ్ల కిందటి వరకు బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. మొన్నమొన్నటి వరకు ఈ ఊహాగానాలు చెలరేగాయి. అయితే, అవి కేవలం వదంతులేనని తేలింది. కాగా, జగ్గారెడ్డి సీఎం కావాలనుకోవడంలోనూ తప్పులేదు. వీహెచ్, జానారెడ్డితో పోలిస్తే జగ్గారెడ్డికి ఇంకా 20 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు కాలం కలిసివస్తే సీఎం అయ్యే చాన్సుంది. అయితే, అలాంటిది ఎన్నికల ముంగిట ''సీఎం'' వ్యాఖ్యలు చేయడమే చర్చనీయాంశం అవుతోంది.

వారితో చెప్పిస్తున్నారా?

రాజకీయాలంటేనే ఎత్తులు-పైఎత్తులు, వ్యూహాలు-ప్రతివ్యూహాలు. ప్రత్యర్థి పార్టీని, ప్రత్యర్థిని వ్యూహాత్మకంగా మానసికంగా దెబ్బకొట్టడం రాజకీయాల్లో సాధారణం. ఇది అన్ని పార్టీలు చేసేదే. అయితే, నాయకత్వ పటిమ ఉన్న పార్టీలు మరింత బలంగా ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కొందరు చేస్తున్న సీఎం వ్యాఖ్యలూ ఇలాగే అనిపిస్తున్నాయి. వారు స్వచ్ఛందంగా ఇలా మాట్లాడుతున్నారా? లేక వెనుక ఎవరైనా ఉండి మాట్లాడేలా చేస్తున్నారా? అనే అనుమానాలు ప్రబలుతున్నాయి. కాగా, గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరయిన కాంగ్రెస్ గురించి నెగెటివ్ ప్రచారం జరిగేలా సీనియర్ నేతల వ్యాఖ్యలు ఉన్నాయన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ''కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు?'' అనే ప్రశ్నలు వస్తుండగా.. ముందే ''నేనంటే నేనే సీఎం'' అనే వ్యాఖ్యలు ఆ పార్టీకి మరింత చేటుచేసేలా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News