తెలంగాణ ఎన్నికలా మజాకా.. ఏకం గా రూ.20 వేల కోట్లకు పైగా
దీంతో ఈ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన అసెంబ్లీ ఎన్నికలుగా నిలిచిపోయే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అంటే మాటలా? అటు అధికార బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ.. ఇలా మూడు ప్రధాన పార్టీలు అధికారం కోసం హోరాహోరీగా ఢీ కొడుతున్నాయి. కుర్చీ కాపాడుకోవాలని బీఆర్ఎస్, కుర్చీ ఎక్కాలని కాంగ్రెస్, బీజేపీ పట్టుబడుతున్నాయి. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నాయి. అందుకోసం వేల కోట్లు ఖర్చు పెట్టేందుకూ సిద్ధమయ్యాయని తెలిసింది. దీంతో ఈ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన అసెంబ్లీ ఎన్నికలుగా నిలిచిపోయే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ ఎన్నికల కోసం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చవుతుందని తెలిసింది. దీంతో ఎన్నికల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికలంటే ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండగ. కానీ అది ఇప్పుడు నోట్ల జాతరగా మారిపోయిందని సామాజిక వేత్తలు వాపోతున్నారు. ఓట్ల కోసం వేలకు వేలు గుమ్మరిస్తూ.. విజయం కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్న పార్టీల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శిస్తున్నారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లోనే అంచనాలకు మించి కోట్లకు కోట్లు ఖర్చు జరిగిందని చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో రూ.700 కోట్లు, మునుగోడు ఉప ఎన్నికలో రూ.600 కోట్లు ఖర్చుయిందని అంటున్నారు.
ఇప్పుడిక 119 స్థానాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.20 వేల కోట్లకు పైనా అవుతుందంటున్నారు. ఇప్పటికే పోలీసులకు పట్టుబడ్డ నగదు, నగల విలువ రూ.709 కోట్లకు పైనే. ఇందులో రూ.290 కోట్లు నగదు రూపంలోనే ఉంది. ఇది కేవలం అధికారికంగా పోలీసులకు దొరికింది మాత్రమే. అదే వివిధ రూపంలో వేల కోట్లు ఇప్పటికే చేరాల్సిన చోటికి చేరిపోయాయని, ఓట్ల కోసం పంపిణీ కూడా జోరుగా సాగుతోందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గాల పరిధిలోని వ్యాపారవేత్తలు, రియల్టర్ల ద్వారా డబ్బును అక్రమంగా తరలించారని తెలిసింది. గ్రామాల్లో సర్పంచ్, మండలాల్లో ఎంపీటీసీలు, జిల్లాలో జడ్పీటీసీలు ఈ డబ్బు పంపిణీని పర్యవేక్షిస్తున్నారని తెలిసింది.