సీఎం రేవంతే అడుగుతున్నారు.. కేసీఆర్ సభకు ఎందుకు రారు?

ఆట కావొచ్చు.. ఎన్నికలు కావొచ్చు. గెలుపు ఒకరికే సాధ్యం. ఒకరు గెలుస్తారు.. మరొకరు ఓడతారు

Update: 2024-02-12 12:33 GMT

ఆట కావొచ్చు.. ఎన్నికలు కావొచ్చు. గెలుపు ఒకరికే సాధ్యం. ఒకరు గెలుస్తారు.. మరొకరు ఓడతారు. ఆటలో ఆ రోజుకు ఎవరైతే అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తారో వారు విజయం సాధిస్తే.. ఎన్నికల్లో ప్రజల మనసుల్ని దోచుకున్న వారు ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపడతారు. ఏమైనా ప్రజా తీర్పును అందరూ తలొగ్గాల్సిందే. మరి.. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతేంటి? ఆయన చేతిలో ఉన్న అధికారం చేజారిపోవటం.. చివరకు ఎన్నికల్లో పోటీ చేసిన ఒకచోట ఓడిపోవటం లాంటి పరిస్థితిని ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఊహించలేదేమో?

ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాంహౌస్ బాత్రూంలో జారి పడటం.. తుంటి ఎముక విరగటం.. కొద్ది కాలంగా బెడ్ రెస్టుతో సేద తీరుతున్న ఆయన ఈ మధ్యనే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయటం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఆరంభం కావటం తెలిసిందే. ఈ సమావేశాలకు కేసీఆర్ వస్తారని.. ఆయన తన వాదన వినిపిస్తారని అందరూ ఆశించారు. ఆయన గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఆయన సభకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. వారి అంచనాలకు తగ్గట్లే కేసీఆర్ సభకు హాజరు కావటం లేదు.

క్రిష్ణా ప్రాజెక్టులపై రేవంత్ ప్రభుత్వం ఈ రోజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా అసత్యాలు చెప్పారంటూ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ ఆరోపించారు. ఒకవేళ అదే నిజమని అనుకుందాం. ఆ విషయాన్ని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభా ముఖంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కదా? అలాంటి పని ఎందుకు చేయరు? బాధ్యత కలిగిన సభ్యుడిగా సభకు ఆయన ఎందుకు రావటం లేదన్నది ప్రశ్న. రాజకీయ వర్గాల్లోనే కాదు.. ప్రజల్లోనూ ఇదో ఆసక్తికర చర్చగా మారింది. ప్రజల కోసం అదే పనిగా ఆలోచిస్తానని.. వారి బాగు కోసం తపిస్తానని చెప్పినప్పుడు బాధ్యత కలిగిన సభ్యుడిగా అసెంబ్లీకి హాజరు కావాల్సిన అవసరం ఉంది కదా? అలా ఎందుకు చేయటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా కేసీఆర్ సభకు రావాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా డిమాండ్ చేసే పరిస్థితి రావటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. కేసీఆర్ సభకు రావాలని.. పదేళ్ల పాలనలో జరిగిన పాపాలకు ఆయనే కారణమన్న ముఖ్యమంత్రి రేవంత్.. ‘‘బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలకు విలువ లేదు. కేసీఆర్ సభకు వస్తే ఎంతసేపైనా చర్చిస్తాం. క్రిష్ణా జలాలపై చర్చకు కేసీఆర్ ఎందుకు రాలేదు? సభకు రాకుండా కేసీఆర్ ఫాంహౌస్ లో దాక్కున్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అవమానిస్తున్నారు’’ అంటూ సీఎం నిప్పులు చెరిగారు. ఒక ముఖ్యమంత్రి.. ఒక ప్రతిపక్ష నేతను సభకు రావాలని తాము వినిపిస్తున్న వాదనలో తప్పులు ఉంటే ఎత్తి చూపాలన్నప్పుడు ఆ పని కేసీఆర్ ఎందుకు చేయరు? అన్నది ప్రశ్న. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం సభకు తనకుఇష్టం వచ్చినప్పుడు రావటం.. ఇష్టం లేనప్పుడు రాకపోవటం తెలిసిందే. ప్రజల తీర్పు తర్వాత కూడా కేసీఆర్ తన తీరును మార్చుకోకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News