అంత విలువైన ప్రాంతంలో ఎకరం రూపాయేనా: ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు!

ఈ 100 ఎకరాల విక్రయంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,625 కోట్ల మేర ఆదాయం సమకూరింది.

Update: 2023-08-29 08:27 GMT

తెలంగాణ ప్రభుత్వం చేసిన భూపందేరంపై ఆ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌ లో ఎకరం రూ.1 చొప్పున ఐదు ఎకరాలను రాజా బహద్దూర్‌ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీకి ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూకేటాయింపులను ఏవిధంగా సమర్థించుకుంటారో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని నోటీసుల్లో ఆదేశించింది.

రాజా బహద్దూర్‌ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీకి బుద్వేల్‌ లో సర్వే నం.325/3/2లో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ 2018 సెప్టెంబరు 9న కేసీఆర్‌ ప్రభుత్వం జీవో 195 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌ కు చెందిన సామాజిక కార్యకర్త కోటేశ్వరరావు, మరొకరు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

ఈ పిల్‌ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. 2018లో జీవో జారీ అయినప్పటికీ అది బయటికి రాలే దని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకు జీవో బయటికి రావడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు విపినించారు. భూకేటాయింపునకు తగిన కారణాలున్నాయని, వాటిపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

కాగా బుద్వేల్‌ లో ఆగస్టు 10న 100 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేసింది. ఈ 100 ఎకరాల విక్రయంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,625 కోట్ల మేర ఆదాయం సమకూరింది. కోకాపేట తర్వాత ప్రభుత్వానికి అధిక ఆదాయానిచ్చిన ప్రాంతంగా బుద్వేల్‌ నిలవడం విశేషం. భూముల కొనుగోలుకు డెవలపర్లు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పోటీపడ్డాయి.

వేలంలో పెట్టిన 14 ల్యాండ్‌ పార్సిల్స్‌ పూర్తిగా అమ్ముడుపోయాయి. బుద్వేల్‌ లో ఎకరం సగటు ధర రూ.36.25 కోట్లుగా ఖరారయ్యింది. గరిష్ఠంగా ఎకరం ధర రూ.41.25 కోట్లు పలికింది. కనిష్ఠంగా ఎకరానికి రూ.33.25 కోట్లు లభించింది.

ఈ నేపథ్యంలో ఇంత విలువైన బుద్వేల్‌ లో ఎకరం రూపాయి చొప్పున ఐదు ఎకరాలను రాజా బహద్దూర్‌ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీకి కట్టబెట్టడంపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

Tags:    

Similar News