గులాబీ సారుకు ద్రోహం.. కేటీఆర్ ఆవేదన మామూలుగా లేదుగా?

తెలంగాణరాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటల్లోనూ వేదన అంతకంతకూ ఎక్కువై.. నిందారోపణలు చేయటం కొట్టొచ్చిన మార్పుగా మారిందన్న మాట అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

Update: 2023-10-01 16:30 GMT

మొన్నటి వరకు అంతా బాగుందన్న మాటకు భిన్నంగా.. ఈ మధ్యన లెక్కల్లో తేడా.. వీస్తున్న గాలిలోనూ వ్యతిరేకత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న వాదన వేళ.. తెలంగాణరాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటల్లోనూ వేదన అంతకంతకూ ఎక్కువై.. నిందారోపణలు చేయటం కొట్టొచ్చిన మార్పుగా మారిందన్న మాట అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. గురి పెట్టిన ఆరోపణస్త్రాలు దారి తప్పాయన్న మాట వినిపిస్తోంది.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ చేయటం బాగానే ఉన్నా.. అందులో పస కంటే నస ఎక్కువగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తుమ్మలకున్న పేరుకు భిన్నంగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్ వయసు.. అనుభవం సరిపోవటం లేదంటున్నారు. ఎంత మాట పడితే అంత మాట అనేసే అవకాశం ఇప్పటి దూకుడు రాజకీయాల్లో ఉన్నా.. శ్రుతి మించి రాగాన పడుతున్న వాదనలు మేలు కంటే కీడే చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గడిచిన కొన్నేళ్లుగా పక్కన పెట్టేసిన గులాబీ బాస్ తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన.. ఈ మధ్యన కాంగ్రెస్ లో చేరటం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై తుమ్మల చేస్తున్న ఆరోపణలు అంతకంతకూ పదును తేలుతున్నాయి. ఆయన మాటలతో ఎంత ఇబ్బందికి గురి అవుతుందన్న విషయం తాజాగా మంత్రి కేటీఆర్ మాటలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. తుమ్మల విమర్శలు.. ఆరోపణలకు సమాధానాలు ఇచ్చేందుకు బదులుగా తిరిగి ఆయన్ను ఉద్దేశించి చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు లాభం కంటే నష్టాన్నే కలిగిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొన్నేళ్లుగా పక్కన పెట్టేస్తూ అవమానిస్తున్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశమే తుమ్మలను గులాబీ కారు దిగేలా చేసిందని చెబుతుంటారు. ఈ వాదనకు కౌంటర్ గా తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ‘గతంలో ఇంట్లో ఓడిపోయి కూర్చున్న వారికి కేసీఆర్ పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అలాంటివాళ్లే ఈసారి టికెట్ రాలేదని పార్టీకి ద్రోహం చేసి పోయారు. నిన్నటి వరకు దేవుడిలా కనిపించిన కేసీఆర్.. ఇప్పుడు దుర్మార్గుడు అయ్యారా? 150 ఏళ్ల కాంగ్రెస్ వారెంటీ ఎఫ్పుడో అయిపోయింది. గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ నేతలు కొత్త కొత్త డైలాగులు కొడుతున్నారు. హైదరాబాద్ లో కమాండ్.. బెంగళూరులో న్యూ కమాండ్.. ఢిల్లీలో హైకమాండ్.. ఇది కాంగ్రెస్ పరిస్థితి’’ అంటూ రిథమ్ తప్పకుండా కేటీఆర్ చేస్తున్న ఘాటు వ్యాఖ్యలకు ప్రతిస్పందన పెద్దగా లేకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.

తుమ్మలపై ద్రోహం ముద్ర వేసిన మంత్రి కేటీఆర్ మిస్ అవుతున్న మాటేమంటే.. నాడు తుమ్మల ఇంటికి వెళ్లి.. భోజనం చేసి.. తమతో కలిసి నడవాలంటూ చేయి చాచింది ఎవరు? అంటూ గతాన్ని గుర్తు చేస్తున్నారు. తుమ్మలకు మంత్రి పదవి ఆఫర్ చేసి.. ఆయన్ను ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్ మాటల్ని మంత్రి కేటీఆర్ మర్చిపోయి.. ఈ రోజు ద్రోహం ముద్ర వేస్తే పడిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ముద్రలు వేసే వేళ కాస్తంత హోంవర్కు చేస్తే బాగుంటుందంటూ పలువురు మంత్రి కేటీఆర్ కు సూచనలు చేస్తున్నారు. మరి.. ఆ మాటలు మంత్రి కేటీఆర్ వరకు చేరుతున్నాయా?

Tags:    

Similar News