పోటాపోటీగా అధినేతల పర్యటనలు

దేశంలో ఎన్నికల వేడి రగులుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల కోసం మూడు పార్టీలు మమ్మరంగా కసరత్తు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి

Update: 2024-03-11 13:22 GMT

దేశంలో ఎన్నికల వేడి రగులుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల కోసం మూడు పార్టీలు మమ్మరంగా కసరత్తు చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఆ పార్టీల అధినేతలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదపనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అమిత్ షా, కేసీఆర్, రేవంత్ రెడ్డి సభలు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. దేశంలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు.

రేపు సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించే ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రకటనకు రెండు రోజుల ముందే రేవంత్ రెడ్డి మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఇక్కడ నుంచి అత్యధిక సీట్లు సాధించాలని రేవంత్ భావిస్తున్నారు. దీని కోసమే మహిళలను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించి వారిలో ఉత్తేజం నింపనున్నారు.

ఇక గులాబీ బాస్ కరీంనగర్ కదనబేరి పేరుతో పార్లమెంట్ ఎన్నికల కోసం బహిరంగ సభతో శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శాసనసభ ఎన్నికల్లో పోయిన పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. దీని కోసమే నేతలకు దిశానిర్దేశం చేయాలనే ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా నేతల్లో ఉన్న భయాలను పోగొట్టనున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని భావించి కరీంనగర్ నుంచే ఎన్నికల సంగ్రామం మొదలు పెట్టేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం దేశంలో బీజేపీ హవా వీస్తోంది. దీంతో దక్షిణాదిలో అధిక స్థానాలు దక్కించుకోవాలని కమలదళం కూడా ఆలోచిస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనం పేరుతో సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపి లోక్ సభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలని పట్టుదలగా ఉన్నారు. మార్చి 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ఉద్దేశంతో నేతలు పరుగులు పెడుతున్నారు. తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేసి ప్రజలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు రాజకీయ పార్టీలు తమ ప్రభావం చూపించాలని భావిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పైచేయి సాధించాలని భావిస్తున్నాయి. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. తాము ప్రకటించిన పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాగా ముందుకు వెళ్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News