పది వరుసలు.. 9 అక్షర దోషాలు.. ఇదే మి తెలుగు?

వాడుక భాషకు గొడుగు పట్టి.. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడిగా గిడుగు వెంకట రామమూర్తి పంతులు నిలిచారు

Update: 2023-08-28 07:30 GMT

వాడుక భాషకు గొడుగు పట్టి.. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడిగా గిడుగు వెంకట రామమూర్తి పంతులు నిలిచారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకలోకి తెచ్చిన ఘనత ఆయన సొంతం. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలునూ చాటిన వ్యక్తి గిడుగు. తెలుగు నాట వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. ఆయన జయంతిని తెలుగు (వాడుక భాష) దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన పేరిట ప్రభుత్వాలే కాక.. సంఘాలు కూడా పురస్కారాలు ప్రకటిస్తుంటాయి. ఇలానే ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం కొందరిని పురస్కారాలకు ఎంపిక చేసి ఆహ్వాన పత్రికలు పంపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆ పత్రికలను చూసే అందరూ నోరెళ్లబెట్టారు.


వరుసకో తప్పా..?

ఏపీ అధికార భాషా సంఘానికి ప్రస్తుతం ఆంధ్రప్రభ మాజీ సంపాదకుడు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ విజయ్ బాబు అధ్యక్షుడిగా ఉన్నారు. గిడుగు జయంతి సందర్భంగా పురస్కార గ్రహీతలకు ఆయన పంపిన ఆహ్వాన లేఖ పది వరుసలతో ఉంది. తేట తెలుగులో చక్కగా పంపాల్సిన ఈ లేఖను ఆయన చూశారో లేదో కానీ.. మొత్తం 9 అక్షర దోషాలున్నాయి. సహజంగా గిడుగు పురస్కారం ఇచ్చేది తెలుగు భాష కోసం విశేషంగా పాటుపడినవారికే. అలాంటప్పుడు వారికి పంపే లేఖ ఒక్క తప్పు కూడా లేకుండా ఉండాలి.

గుడి దీర్ఘాలు.. ఒత్తులు లేవు..

తెలుగుకు నుడికారం అందం అంటారు. మన భాషకు దీర్ఘం, గుడి దీర్ఘం, ఒత్తులు కూడా ఓ అలంకారం. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం తెలుగు వారోత్సవాల సందర్భంగా గిడుగు పురష్కారానికి ఎంపిక చేసినవారికి పంపిన లేఖల్లో వీటిని కూడా సరిగా రాయలేకపోయారు. ఉదాహరణకు గ్రహీతను గ్రహిత అని తేదీని తేదిగా.. గౌరవనీయులైన పదాన్ని గౌరవనియులైన అని.. నిర్వహిస్తున్నను నిర్వహిస్తునగా.. ఆహ్వానాన్ని ఆహ్వాన్నానిగా రాసుకొచ్చారు.

సంఘం పేరూ తప్పేనా?

చివరకు తమ సంస్థ పేరునూ సక్రమంగా రాయలేకపోయారు. 'తెలుగు భాషాబివృధి ప్రాధికార సంస్థ' అన్నారు. కాగా, ఈ నెల 29న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పురస్కార గ్రహీతలకు ఇలా తప్పులతో కూడిన ఆహ్వాన పత్రికను విజయ్ బాబు వాట్సప్ చేశారు. అందులోని తప్పులు తెలుసుకున్నారేమో..? ఆ తర్వాత వాటిని సరిచేస్తూ మరో ఆహ్వానపత్రికను పంపించారు.

Tags:    

Similar News