ఇది ఖాయం.. తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు, ప్రతిపక్ష నేతలు.. కలవనే కలవరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడు ఒకేసారి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

Update: 2024-08-04 12:30 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడు ఒకేసారి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. విభజన జరిగాక 2014లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు సీఎంలు అయ్యారు. కేసీఆర్ 2018లో ముందస్తుకు వెళ్లి మరోసారి సీఎం కాగా, 2019లో చంద్రబాబు ఓటమిపాలయ్యారు. దీంతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఇక గత ఏడాది తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇటీవల ఏపీలో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి పీఠం చేపట్టారు. అంటే.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష నేతలు ఇద్దరూ.. మాజీ సీఎంలే అన్నమాట.

హోదా ఉన్నా లేకున్నా

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కింది. ఏపీలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కు మాత్రం అందుకు అవకాశం లేకపోయింది. అయితే, వీరిద్దరూ అసెంబ్లీకి మాత్రం వచ్చే అవకాశం కనిపించడం లేదు. గురుశిష్యుల మాదిరిగా వ్యవహరించే వీరు.. యాక్సిడెంటల్ గా ఒక్క రోజుకు మాత్రమే తమతమ అసెంబ్లీలకు హాజరవడం గమనార్హం. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందున తమకు గొంతు విప్పే అవకాశం దక్కదంటూ జగన్ వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడాన్ని ఇబ్బందిగా భావిస్తూ గైర్హాజరు అవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అసెంబ్లీ లేదు.. మరి కలిసేదెక్కడ?

సీఎంలు, ప్రతిపక్ష నేతలుగా.. చంద్రబాబు-వైఎస్ దాదాపు 15 ఏళ్లు ముఖాముఖి తలపడ్డారు. ఆ సమయంలో వీరిలో ఎవరూ అసెంబ్లీని బాయ్ కాట్ చేయలేదు. దీంతో సీఎం, ప్రతిపక్ష నేతలను సభలో చూసే అవకాశం ప్రజలకు దక్కింది. అంతేగాక పలు కార్యక్రమాల్లోనూ వీరి కొన్నిసార్లు కలిసి పాల్గొన్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)కీ హాజరైన సందర్భాలున్నాయి. అసెంబ్లీ ముగిశాక సభ్యుల గౌరవ విందుల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం మాత్రం సీఎంలు, ప్రతిపక్ష నేతలు ఒకేచోట కనిపించే అవకాశమే లేదు. రేవంత్-కేసీఆర్, చంద్రబాబు-జగన్ ఉప్పునిప్పులా ఉండడమే దీనికి కారణం. ఇటీవల కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరైన సందర్భంలో, జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి వచ్చిన సందర్భంలో పరిస్థితులను చూసినవారు ఎవరికైనా ఇది తెలిసిపోతుంది. బహుశా వచ్చే ఐదేళ్లు ఇదే వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు.

Tags:    

Similar News