ఉద్విగ్నం-ఉత్కంఠ-ఉద్రేకం.. ఎటు చూసినా ఇదే వరస
ఉదయంఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మరో 15 గంటల్లో తొలి ఓటు పడనుంది. ఆ మరుక్షణం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఐదేళ్ల భవితవ్యానికి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయంఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
ఇదిలావుంటే.. ఇప్పుడు తెలంగాణ వాతావరణం ఎలా ఉంది? నాయకులు ఎలా ఫీలవుతున్నారు? పరిస్థితి ఏ విధంగా ఉంది?... అంటే.. అంతటా ఉద్విగ్నం-ఉత్కంఠ-ఉద్రేకం.. ఎటు చూసినా ఇదే వరస! అధికార పార్టీ బీఆర్ ఎస్ నుంచి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వరకు.. స్వతంత్రుల నుంచి చిన్నా చితకా పార్టీల అభ్యర్థుల వరకు .. ఇలానే ఫీలవుతున్నారు. రేపు ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఇక, రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి వస్తుందోనని పోలీసులు, ఎన్నికల సంఘం ఉద్విగ్నంగా చూస్తోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని చెబుతున్నా.. మరో 15 గంటల పాటురాష్ట్రంలో పరిస్థితి చేజారకుం డా చూడాలన్న వారి లక్ష్యం.. కొంత ఉద్విగ్నంగానే ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో డబ్బుల పంపిణీని అడ్డుకుంటున్నా.. ఎక్కడా ఆగడం లేదు. మంగళవారం రాత్రిఏకంగా 10 కోట్లు, బుధవారం ఉదయం మరో 10 లక్షలు లభించాయి.
దీనిలో పోలీసులు, ఉన్నతాధికారులు, మాజీ అధికారులు కూడా ఉండడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇక, పందెం రాయుళ్ల మధ్య కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారనే విషయాలపై కోట్ల రూపాయల్లో పందేలు కట్టిన వారు.. ఎన్నికల పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్ సరళిని బట్టే.. ఫలితాన్ని అంచనా వేయడం.. ఇటీవల కాలంలో సహజంగా మారిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఇక్కడ కూడా.. కాంగ్రెస్, వైసీపీ టీడీపీలు ఏం జరుగుతుంది? తెలంగాణ ఓటరు ఎలా స్పందిస్తాడని ఎదరు చూస్తున్నారు. ఇక తెలంగాణ నగరు ఓటరు అసలు బూత్‌లకు కదులుతాడా? సెలవు ఉంది కదా.. ఇంటికే పరిమితం అవుతాడా? అని నగరంలో పోటీ చేస్తున్న నాయకులు ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నారు. రండి.. మీకు నచ్చిన వారికి ఓటేయండి.. అని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రచారం చేస్తుండగా.. అధికార పార్టీ నాయకులు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఇక, పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు కంటికి నిద్రలేకుండా.. వ్యవహరిస్తున్నారు. ఎటు చూసినా.. ఉద్విగ్నం-ఉత్కంఠ-ఉద్రేక పూరిత వాతావరణమే కనిపిస్తుండడం గమనార్హం.