సిక్కోలు వ్యథలు కళ్లకు కట్టిన 'తండేల్'... 2018లో అసలేం జరిగింది?

ఈ సమయంలో.. అసలు నాడు వాస్తవంగా సిక్కోలు మత్స్యకారుల జీవితాల్లో ఏమి జరిగిందనేది ఆసక్తిగా మారింది.

Update: 2025-02-08 11:30 GMT

సంక్రాతికి వచ్చిన సినిమాల సందడి అనంతరం అంత పెద్ద సీజన్ కాకపోయినా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తండేల్ సందడి ఇప్పుడు ఎటు చూసినా కనిపిస్తోందనే చెప్పాలి. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ గా చెబుతోన్న ఈ సినిమాలో రియల్ స్టోరీని చుపించారు మేకర్స్! ఇక.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి.

అవును... ఇప్పుడు ఎటు చూసినా తండేల్ సినిమాకు సంబంధించిన చర్చే సాగుతుందని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ప్రధానంగా శ్రీకాకుళంలోని మత్స్యకారుల వ్యథలను కళ్లకు కట్టినట్లు చూపించారని చెబుతున్నారు. ఈ సమయంలో.. అసలు నాడు వాస్తవంగా సిక్కోలు మత్స్యకారుల జీవితాల్లో ఏమి జరిగిందనేది ఆసక్తిగా మారింది.

శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా సముద్ర తీరం విస్తరించి ఉంది. ఇందులో భాగంగా.. సుమారు 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి! ఈ క్రమంలో ప్రధానంగా ఇచ్చాపురం లోని డొంకూరు నుంచి రణస్థలంలోని దోనిపేట వరకూ ఏకంగా 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. అయినప్పటికీ జిల్లాలో షిప్పింగ్ హార్బర్లు లేవు!

దీంతో... మత్స్యకారులంతా సంప్రదాయ వేటకే పరిమితమయ్యారు. ఇందులో భాగంగా.. ఇప్పటికీ నాటు పడవలపైనే సముద్రంలో వేట సాగిస్తున్నారు. మరోపక్క స్థానికంగా గిట్టుబాటుగాక చెన్నై, ముంబై, కోల్ కతా, పారాదీప్, గుజరాత్ లోని వీరావల్ వంటి ప్రాంతాలకు చాలా మంది సిక్కోలు మత్స్యకారులు వలస వెళ్తుంటారు.

ఈ నేపథ్యంలోనే 2018లో కె. మత్స్యలేశం గ్రామం నుంచి మత్స్యకారులు వీరావల్ కు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఆ ఏడాది నవంబర్ 30న పొరపాటున పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించేశారు. దీంతో... వెంటనే వారి పాక్ నేవీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.. ఫలితంగా వీరంతా ఆ దేశపు జైల్లో సుమారు 13 నెలలపాటు మగ్గిపోయారు.

ఆ సమయంలో స్థానిక ఎంపీ రామ్మోహన్ నాయుడు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు ఈ విషయం చెప్పడంతో 2020 జనవరి 6న మత్స్యకారులకు విముక్తి లభించింది. ఇది జరిగింది.! ఇదే తండేల్ సినిమా కథకు మూలం అయ్యింది!

ఇక... స్థానికంగానే ఉపాధి కల్పించేలా గతంలో టీడీపీ హయాంలో భావనపాడు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినా పని అవ్వలేదు.. తర్వాత వైసీపీ హయాంలో బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ముందుకు కదలలేదు. ఈ సమయంలో మరోసారి 2018 నాటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఈసారైనా వారికి స్థానికంగానే ఉపాధి దొరకాలని కోరుకుంటున్నారు!

Tags:    

Similar News