ప్రధాని రేసులో సారు.. ఖాతా తెరవని కారు.. పార్టీ చరిత్రలో తొలిసారి సున్నా!
ఇప్పుడు ఈ రెండు పార్టీలు తిరిగి లేవాలంటే చాలా గట్టి ప్రయత్నాలే జరగాలి.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఏ పార్టీని ఎంత ప్రభావితం చేశాయో తెలియదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలను చాలా గట్టి దెబ్బకొట్టాయి. అవే బీఆర్ఎస్, వైసీపీ. తెలంగాణలో ఆరేడు నెలల కిందటి దాకా అధికారంలో తిరుగులేదని భావించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి జారిపోయింది.. ఏపీలో వై నాట్ 17తిరుగులేదని భావించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి జారిపోయింది.. ఏపీలో వై నాట్ 175 అంటూ వెళ్లిన వైసీపీ 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు తిరిగి లేవాలంటే చాలా గట్టి ప్రయత్నాలే జరగాలి.
బీఆర్ఎస్ జీరో
తెలంగాణలో 8 సీట్ల చొప్పున గెలుచుకుని కాంగ్రెస్, బీజేపీ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాయి. పైకి చూస్తే గతంలో కంటే రెట్టింపు సీట్లతో బీజేపీనే ఎక్కువ లాభం పొందింది. కాంగ్రెస్ 3 సీట్ల నుంచి 8కి చేరింది. ఇక అత్యంత నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీనే. కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఓ దశలో ప్రధాని పదవి రేసులో ఉన్నట్లుగా చెప్పుకొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇది ఊహించని పరాజయమే. కాళేశ్వరం కూలి, కూతురు కవిత జైలు పాలై, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి, ఫోన్ ట్యాపింగ్ వెంటాడుతూ ఉండగా లోక్ సభ ఫలితాలు పుండు మీద కారం చల్లాయి.
చరిత్రలో తొలిసారి..
2001లో బీ(టీ)ఆర్ఎస్ ను స్థాపించాక 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని వెళ్లింది ఆ పార్టీ. ఐదుచోట్ల పోటీ చేసి అన్నింట్లోనూ గెలిచింది. 2009లో మాత్రం మహా కూటమి అంటూ టీడీపీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లి 2 ఎంపీ సీట్లే నెగ్గింది. 2014లో తెలంగాణ ఖరారయ్యాక ఎన్నికలు జరగ్గా.. 11 చోట్ల గెలిచింది. 2019లో మాత్రం సారు.. కారు.. పదహారు అంటూ వెళ్లి బొక్కా బోర్లా పడింది. సొంత కూతురు కవితనే నిజామాబాద్ లో ఓడింది. 9 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఇక ఈ ఎన్నికల్లో ఖతానే తెరవలేకపోయింది.
ఓటమి కంటే ఓడిన తీరే..
లోక్ సభ ఎన్నికల్లో ఓటమి కంటే బీఆర్ఎస్ ఓడిన తీరే అవమానకరంగా ఉంది. 17 సీట్లలోనూ పోటీ చేసిన ఆ పార్టీ రెండింటిలోనే రెండో స్థానంలో నిలిచింది. 14 చోట్ల మూడో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ లో అయితే నాలుగో స్థానం. సాంకేతికంగా 16.68 శాతం ఓట్లు కనిపిస్తున్నా.. అవన్నీ మెదక్ వంటి బలమైన నియోజకవర్గాల్లో అధికంగా పోలైనందున వచ్చినవే. చివరగా చెప్పేదేమంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని.