రాజుగారిని ''కొండ'' మీదకి పంపనున్న చంద్రబాబు!?

ఈ విషయంపై ఇప్పటికే చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Update: 2024-06-29 05:30 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబుతో పాటు మరో 24మంది మంత్రులు ఎవరి శాఖల పనుల్లో వారు బిజీగా ఉన్నారు. మరోపక్క కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై తెలుగు తమ్ముళ్లు, అటు బీజేపీ నేతలు, జనసేన నాయకులు ఆశలుపెట్టుకున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ఇందులో భాగంగా వీలైనంత తొందరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని స్వయంగా చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో పార్టీకోసం కష్టపడినవారికే పదవులు అని తేల్చి చెప్పారు. ఈ సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ ఎవరనే విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ సందర్భంగా ఒక పెద్దాయన పేరు తెరపైకి వచ్చింది!

అవును... టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రారంభం నుంచీ ఉన్న నేత, 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు పేరు తాజాగా టీటీడీ ఛైర్మన్ విషయంలో వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎంపికపై అధికారిక ప్రకటన రానప్పటికీ... చంద్రబాబు ఈయనవైపే సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. అందుకు ఎన్నో సానుకూల కారణాలున్నాయని అంటున్నారు.

2014-19 సమయంలో కూడా ఎన్డీయే ప్రభుత్వంలో భాగంగా కేంద్రమంత్రి పదవి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు... ఆ అవకాశం అశోక్ గజపతి రాజుకే కేటాయించారు. దీంతో ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఇటీవల ఎన్నికల్లో ఆయన పోటీ చేయనప్పటికీ.. ఆయన కుమార్తె అదితి విజయలక్ష్మి పోటీ చేసి సుమారు 60వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అయితే... గత ఎన్నికల్లో అటు ఎమ్మెల్యే, ఇటు ఎంపీగా పోటీ చేయలేదు అశోక్ గజపతి రాజు. ఆ సంగతి అలా ఉంటే... అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఛైర్మన్ పదవి ఆయనను వరించబోతోందని.. అధికారిక ప్రకటనే తరువాయని అంటున్నారు.

కాగా... ఇటీవల టీడీపీకి ఒక గవర్నర్ పోస్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని... ఆ విషయంలోనూ అశోక్ గజపతి రాజుతో పాటు యనమల రామకృష్ణుడి పేరు లైన్ లో ఉందనే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాజాగా టీటీడీ ఛైర్మన్ పదవి అశోక్ గజపతిరాజునే వరించనుందనే కథనాలు తెరపైకి వస్తున్నాయి! ఈ లెక్కన గవర్నర్ పదవి యనమలను వరించే అవకాశం ఉన్నట్లే అని అంటున్నారు!!

Tags:    

Similar News