సమ సమాజం కోసం కరోడ్ పతీ టాక్స్ విధించాల్సిందే !

ప్రాంతం ఏదైనా దేశం ఏదైనా మనిషికీ మనిషికీ మధ్య ఆర్ధిక అంతరాలు రాను రానూ పెరిగిపోతున్నాయి.

Update: 2024-05-27 03:49 GMT

ఇది సమాజం. సమాజంలో ఒకరు బాగుపడ్డారు అంటే దాని వెనక అందరి కష్టం ఉంటుంది. ఒకరు పరిశ్రమ పెడితే అందులో పనిచేసే కార్మికులకు జీతం మాత్రమే వస్తుంది. కానీ లాభాలు మాత్రం యజమాని వెనకేసుకుంటాడు. అందులో వాటా అన్నది ఇవ్వడం జరగదు. అక్కడే అసమానతలు మొదలవుతున్నాయి.

ప్రాంతం ఏదైనా దేశం ఏదైనా మనిషికీ మనిషికీ మధ్య ఆర్ధిక అంతరాలు రాను రానూ పెరిగిపోతున్నాయి. ఎవరు అయినా కోటీశ్వరులు అయ్యేది సమాజం నుంచి సహకారం అందుకునే. ఆ సమాజంలో కొందరు మాత్రం కోట్లకు పడగలు ఎత్తుతూ ఆ సొమ్ము వడ్డీలతో పిల్లలు పెడుతూ వారిని అపర కుబేరులను చేస్తూంటే వేతనాల మీద బతికే వాళ్ళు ఏ పూటకు ఆ పూట అన్నట్లుగా ఉంటున్నారు.

ఒక దశాబ్దం తిరిగేసరికి ఈ సంఖ్య అంతరం ఇంకా ఎక్కువగా ఉంటోంది. దీనికి ఆర్ధిక వేత్తలు చాలా పరిష్కారాలు కనుగొంటున్నారు. అందులో ఒకటి వారసత్వ పన్ను. ఇటీవల కాలంలో ఈ పేరు బాగా వినిపించింది అంటే దానికి కాంగ్రెస్ కి చెందిన ప్రసాసవాసుల విభాగం నేత శ్యాం పిట్రోడా కారణం. ఆయన తన ఆలోచనలను ఒక మీడియాతో పంచుకోగానే బీజేపీ నేతలు దాన్ని పట్టుకుని ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా వాడుకున్నారు.

మీ ఆస్తులను దోచుకుంటారు అన్నంతగా జనాలను బెదరగొట్టేశారు. కానీ శ్యాం పిట్రోడా అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో అలా అమలు చేస్తున్నారని దాన్ని పరిశీలిస్తే ఎంతో కొంత ఆర్థిక అసమానతలు రూపుమాపుతాయని అన్నారు. అయితే దీనిని ఆర్ధిక నిపుణులు సైతం సమర్ధిస్తున్నారు. ఉన్న వాడి సంపద జాతి సొమ్ముగా కాకుండా ప్రైవేట్ సొత్తుగా మారితే దేశానికి మేలు ఎక్కడ జరుగుతుంది అన్నది పెద్ద ప్రశ్న.

అలా కాకుండా ఉండాలీ అంటే వారసత్వ పన్ను వంటి సంస్కరణలను తీసుకుని రావడం ద్వారా ప్రత్యేక పన్నులు విధించి దేశ ఖజానాకు ఆ సంపదలో ఎంతో కొంత వాటా తిరిగి తేవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కోటీశ్వరుడు ఏమీ పెద్దగా కరిగిపోడు సరికదా ఆ వేసిన పన్ను కాస్తా జాతి సొమ్ముగా మారితే పేదలకు ఊరటగా మారుతుంది అని అంటున్నారు.

దీని మీద ఈ రోజున అనేక దేశాలలో బిగ్ డిబేట్ సాగుతోంది. తాజాగా చూస్తే ఫ్రాన్స్ కి చెందిన వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ ఆర్ధిక వేత్తలు అయితే ఇదే రకమైన సూచనలు చేశారు. ఫ్రాన్స్ దేశంలో పెరుగుతున్న ఆర్ధిక అసమానతల నేపధ్యంలో దానిని తగ్గించడానికి సంపన్నుల మీద కరోడ్ పతీ టాక్స్ ని విధించాలని వారు కోరారు.

దానికి వారు చేసిన ప్రతిపాదనలు ఏంటి అంటే 2010 తరువాత కోట్లకు పడగలు ఎత్తిన వారి సంపద మెద పన్నుతో పాటు వారసత్వ పన్ను విధించాలని ఉంది. ఇందులో కూడా పది కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే రెండు సాతం, వంద కోట్లు దాటితే నాలుగు శాతం కరోడ్ పతీ టాక్స్ విధించాలని పేర్కొన్నారు.

అలాగే పది కోట్ల సంపద దటితే వారసత్వ పన్ను కింద 33 శాతం, అలాగే వంద కోట్ల మీద 45 శాతం టాక్స్ విధించాలని ప్రతిపాదించారు. దానిని ఫ్రాన్స్ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేదలు ఉన్నారు. సంపన్నులు ఉన్నారు. అటు నుంచి ధనం ప్రవహించాలీ అంటే పన్నులే ఆధారం.

ఈ రోజున పేదవాడికీ ధనవంతుడికీ ఒకేలా పన్ను విధానం ఉంది. అలా కాకుండా కోటీశ్వరులకు ప్రత్యేక పన్నులు వేసినట్లు అయితే ఖజనాకు ఆదాయం గణనీయంగా వస్తుంది. అదే సమయంలో పేదల మీద పన్నులు తగ్గుతాయి. కానీ కార్పోరేట్ శక్తులతో అంటకాగుతూ వారి కనుసన్నలలో పనిచేసే పాలకులు నిండుగా మెండుగా ఉన్న దేశాలలో ఈ ప్రత్యేక పన్నులు వేయడం అనేది ఎప్పటికీ జరగదు అనే అంటున్నారు.

అందుకే ఆర్థిక అంతరాలు పేరిగి ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఏడు వందల కోట్ల మందికి పైగా జనాభా పేదరికంలో ఉన్నా కూడా పాలకులు పట్టించుకోరు అనే అంటున్నారు. అయితే ఏదో నాటికి గద్దల్లాంటి పెద్దలను కొడితేనే తప్ప సమ సమాజం ఆవిర్భవించదని అంటున్నారు. పేదలు అత్యధికంగా ఉన్న సమాజంలో వారే మానవ వనరులుగా ఉంటారని వారిని కాపాడుకోవాలంటే ఈ సంస్కరణలను ఆలస్యంగా అయినా అంతా అమలు చేసి తీరాల్సిందే అన్నది ఆర్థికవేత్తల కచ్చితమైన అభిప్రాయంగా ఉంది.

Tags:    

Similar News